calender_icon.png 25 December, 2024 | 12:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరె కటికలకు న్యాయం కావాలి!

06-11-2024 12:00:07 AM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా, దేశంలో ఎక్కడ లేని విధంగా చేస్తున్న కులగణన సర్వేలో ఆరె కటికలు అందరూ పాల్గొనాలని నాయకులు కోరుతున్నారు. రాష్ట్రంలో ఆరె కటికలు వెనుకబడిన కులాల (బి.సి)డి జాబితాలో సీరియల్ నెంబర్ లో ఉన్నారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక, విద్యా, ఉపాధి అవకాశాలు లేక పేదరికంలో మగ్గుతున్నారు. ఎంతో ప్రతిభ కలిగిన వారు ఆరె కటికలలో ఉన్నా రాజకీయ అవకాశాలు రాక, నామినేటెడ్ పదవులు దక్కక, చట్టసభలలో లేక సమస్యలు పరిష్కారం కాకుండా ఉండడంతో వీరి పరిస్థితి ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నట్టుగా ఉంది.

రాష్ట్రవ్యాప్తంగా ఆరె కటికలు దాదాపు 12 నుంచి 15 లక్షల వరకు ఉన్నారు. ప్రభుత్వ పరంగా గత ముఖ్యమంత్రిగానీ, ప్రస్తుత ముఖ్యమంత్రికానీ కేవలం 70 వేలమంది మాత్రమే ఉన్నట్టు చెప్పడం భావ్యం కాదు. హైదరాబాద్‌లోని గౌలిపుర, జియగూడ, బేగంబజార్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, లాలపేట్, మల్కాజిగిరి, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, యాదాద్రి ఇంకా అనేక ప్రాంతాలలో ఒక్కొక్క దగ్గర లక్ష జనాభా పైనే ఉన్నారు. కటిక వాడ, కసాబ్ గల్లీ, దాకా వాడి, కటిక బస్తీ అంటూ ఆరె కటిక కులం పేరు మీదే అనేక ప్రాంతాలు ఉన్నాయి.

వీరంతా తరతరాలుగా దుర్భర జీవితాలను గడుపుతున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు గడిచినా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించి పది సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరె కటికలకు కనీసం చట్టసభలకు పోటీ చేయడానికైనా అవకాశం ఇవ్వడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం గానీ, బీసీ కమిషన్ గానీ ఆరె కటికల వెనుకబాటుతనాన్ని గుర్తించి వీరిని బీసీd జాబితా నుంచి బీసీ జాబితాలో చేర్చాలని కోరుతున్నారు. 

- డా. ఎస్.విజయభాస్కర్, హైదరాబాద్