calender_icon.png 29 September, 2024 | 11:12 PM

అర్రాస్‌పాడి అప్పజెప్పేస్తున్రు!

29-09-2024 12:00:00 AM

మత్స్యకార సొసైటీల్లో చేపల చెరువులకు వేలం

కోట్లు కొల్లగొడుతున్న సొసైటీ నేతలు, దళారులు

మత్స్యకారులకు చెల్లించేది రోజుకు రూ.20 మాత్రమే

చెరువులనే నమ్ముకొని జీవిస్తున్నవారికి తీవ్ర నష్టం

నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లాలో మత్స్యకార సొసైటీల ఆధీనంలో ఉన్న చెరువులను వేలంపాట ద్వారా దళారులకు అప్పగిస్తున్నారు. దీంతో చేపల వేటనే వృత్తిగా జీవనం సాగిస్తున్నవారికి తీరని నష్టం వాటిల్లుతోంది.

కులవృత్తినే నమ్ముకొని జీవిస్తున్న మత్స్యకారులకు గత ప్రభుత్వం సబ్సిడీ ద్వారా చేప పిల్లలను పంపిణీ చేసింది. కొందరు దళారులు మాత్రం సొసైటీ నేతలతో కుమ్మక్కై చెరువుల్లోని చేపలను అమాంతం ఎత్తుకెళ్లి కోట్లు కొల్లగొడుతున్నారు. కనీసం ఈత రానివారు, చేపలను పట్టేందుకు వల విసిరే నైపుణ్యం లేని వారు సైతం అధికారులకు, సొసైటీ పెద్దలకు అమ్యామ్యాలు ముట్టజెప్పి అక్రమంగా సభ్యత్వాలు పొందినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఈ సభ్యత్వాలు పొందిన వారితోపాటు రాజకీయ నేతల అండతో సొసైటీ నేతలు చెరువులను అర్రాస్‌కు పెడుతున్నారు. చెరువుల్లో పెరిగిన చేపలను పట్టుకొని ఈ ప్రాంతంలోనే విక్రయించాల్సి ఉండగా సొసైటీ నేతలు మాత్రం అందుకు విరుద్ధంగా దళారులకు అప్పజెప్పి, ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

గత  ప్రభుత్వ రాజకీయ అండదండలు ఉన్న సొసైటీ నేతలే స్థానిక మత్సకారులకు వెన్నుపోటు పొడుస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కందనూలు ప్రాంత చెరువుల్లోని చేపలను పొరుగు రాష్ట్రాలకు తరలించేందుకు ఒక్కో సొసైటీలో మూడేళ్ల కాలానికి కోట్లు గుమ్మరించి వేలంపాట ద్వారా టెండర్లు దక్కించుకుంటున్నారు. చేపలను డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో అమ్ముకుంటూ రూ.వందల కోట్లు వెనకేసుకుంటున్నారు.

కులవృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్న గంగపుత్రులు, చేపలు పట్టేవారికి మాత్రం రోజుకు రూ.20 చొప్పున పంచుతున్నారు. దీంతో జీవనోపాధి కరవై గంగపుత్రులు వలసబాట పడుతున్నారు. ఈ నేపథ్యలో చేపల ధరలు కూడా పెరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. గత పదేళ్లుగా ఇదే తంతు సాగుతోందని స్థానిక మత్సకారులు ఆవేదన చెందుతున్నారు.

కోట్లు కొల్లగొడుతూ..

చెరువుల పరిరక్షణ పేరుతో కొందరు రాజకీయ నేతలు సొసైటీలను అడ్డం పేట్టుకొని పెత్తనం చెలాయిస్తున్నారు. చెరువులను ఏళ్ల తరబడి లీజుకు అప్పగిస్తూ కోట్లు ఆర్జిస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో 1,448 చెరువులకు గానూ గత ప్రభుత్వం 235 సొసైటీలను ఎన్నికల ద్వారా ఏర్పాటు చేసింది.

కృష్ణా పరివాహక ప్రాంతాలైన సోమశిల, మంచాలకట్ట, దోమలపెంట, పాతాలగంగా వంటి ప్రాంతాల్లో 452 మార్కెటింగ్ సొసైటీలున్నాయి. 18,225 మంది ఉపాధి పొందుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ కుటంబాలకు ఉపాధి కల్పించేందుకు గత ప్రభుత్వం భారీగా చేపపిల్లలను పంపిణీ చేసింది.

సొసైటీల్లో సభ్యత్వం పొందిన వారే చేపలను పట్టుకొని స్థానికంగా విక్రయించి ఉపాధి పొందాల్సి ఉంది. కానీ అక్రమంగా సభ్యత్వాలు పొందినవారంతా దళారులతో కుమ్మక్కై చేపలను కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాలకు తరలిస్తున్నారు.

తాజాగా నాగర్‌కర్నూల్ కేసరి సముద్రం చెరువును రూ. కోటి 30 లక్షలకు వేలంపాట ద్వారా దళారులకు మూడేళ్ల కాలానికి అప్పజెప్పారు. సొసైటీలో 340 మంది సభ్యత్వాలు పొందినవారు ఉన్నారు. కాగా మూడేళ్లపాటు రోజుకు ఒక్కొక్కరికి కేవలం రూ.20 మాత్రమే వస్తుంది. దీంతో కులవృత్తిని నమ్ముకున్నవారు జీవనం సాగేదెలా అని ప్రశ్నిస్తున్నారు. 

ఇదే వృత్తిని నమ్ముకుని బ్రతుకుతున్నా..

నేను పదేళ్లుగా చెరువులో చేపలు పట్టుకొని జీవిస్తున్నా. కానీ ప్రస్తుతం చెరువును ఇతరులకు మూడేళ్లపాటు అప్పగిస్తున్నారు. దీంతో మాకు ఉపాధి లేకుండా పోతుంది. సొసైటీ నేతలు దళారులతో ఒప్పందం చేసుకొని మాకు అన్యాయం చేస్తున్నారు. 

 డోకూరు మన్యం, 

మత్సకారుడు, ఉయ్యాలవాడ

వేలానికి పెడితే చర్యలు 

ప్రభుత్వం పంపిణీ చేసిన చేపలను స్థానికులే వలల ద్వారా పట్టుకొని స్థానికంగా విక్రయించాల్సి ఉంటుంది. అలా కాకుండా చెరువుల్లోని చేపలను వేలం వేసి ఇతరులకు అప్పగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.

 గంగారం, 

అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ ఫిషరీస్, 

నాగర్‌కర్నూల్