08-02-2025 05:04:56 PM
జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే...
కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామంలోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి జాతరకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే శనివారం ఎస్పీ డివి శ్రీనివాసరావు, ఏఎస్పి చిత్తరంజన్, ఆర్డిఓ లోకేశ్వర్ రావు, డిఎస్పి కరుణాకర్ తో కలిసి జాతర ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 11, 12, 13 తేదీలలో నిర్వహించే ఉత్సవాలకు అక్కడినుండి హాజరుకానున్న భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు.
వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మందులు, మాస్కులు, ఆర్ బ్ల్యూఎస్ శాఖ తాగునీరు సౌకర్యం కల్పించాలన్నారు. జాతరలో ఎప్పటికప్పుడు శానిటేషన్ చేపట్టాలని డీఎల్పిఓను ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని విద్యశాఖ అధికారులకు సూచించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... ఉత్సవాల సందర్భంగా శాంతి భద్రతలకు ఆటంకం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. 2 డిఎస్పి పర్యవేక్షణలో 300 మంది పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ ఓ సీతారాం, డిఎల్పిఓ హుమార్ హుస్సేన్, తాహసిల్దార్ రామ్మోహన్, ఎంపీడీవో శంకరమ్మ, పంచాయతీరాజ్, విద్యుత్ సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.