11-04-2025 12:00:00 AM
హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
హనుమకొండ, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): మే నెల 14వ తేదీన హైదరాబాద్ లో ప్రపంచ సుందరి పోటీలలో పాల్గొనే వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు వరంగల్ పర్యటనలో భాగంగా కాళోజీ కళాక్షేత్రాన్ని సందర్శించనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేయాలని హనుమకొండ జిల్లా పి.ప్రావీణ్య ఆదేశించారు.గురువారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో రెవెన్యూ, పర్యాటక, ఇతర శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
అంతకుముందు రాష్ట్ర పర్యాటక శాఖ సెక్రెటరీ స్మితా సబర్వాల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వివిధ దేశాలకు చెందిన సుందరిమణులు కాళోజీ కళా క్షేత్రాన్ని సందర్శించనున్న నేపథ్యంలో చేయనున్న ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ కు మార్గ నిర్దేశం చేశారు. పర్యాటక శాఖ సెక్రటరీ స్మితా సబర్వాల్ ఆదేశాల మేరకు జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమన్వయ సమావేశాన్ని నిర్వహించి ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను తెలియజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చారిత్రక నగరమైన వరంగల్ పర్యటనకు ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన సుందరిమణులు వస్తున్నారని, ఇది వరంగల్ నగరానికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు. చారిత్రక, వారసత్వ నగరమైన వరంగల్ ప్రాముఖ్యత ను తెలియజేసేందుకు వేదిక కానుందని కలెక్టర్ తెలియజేశారు.
కాళోజి కళాక్షేత్రాన్ని సందర్శించనున్న వివిధ దేశాలకు చెందిన సుందరి మణులకు తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే విధంగా మహిళలు బతుకమ్మలతో ఘన స్వాగతం పలుకుతారని అన్నారు. ఈ కార్యక్రమం ప్రపంచ స్థాయిలో వరంగల్ పర్యాటక, వాణిజ్య అభివృద్ధికి దోహదపడుతుందన్నారు.
కాళోజీ కళాక్షేత్రం సందర్శన అనంతరం ములుగు జిల్లాలోని ప్రముఖ దేవాలయమైన రామప్పను సందర్శించి అక్కడి కార్యక్రమాల్లో పాల్గొంటా రన్నారు. జిల్లా ఖజానా శాఖ అధికారి శ్రీనివాస్ కుమార్, జిల్లా పర్యాటకశాఖ అధికారి శివాజీ, నెహ్రూ యువ కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ అన్వేష్, కుడా పీవో అజిత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.