01-03-2025 12:02:29 AM
పెద్దపల్లి, ఫిబ్రవరి-28: ప్రశాంతంగా రంజాన్ మాసం నిర్వహించుటకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో రంజాన్ మాసం ఏర్పాట్ల పై అదనపు కలెక్టర్లు డి వేణు, జె.అరుణ శ్రీ లతో కలిసి సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం ప్రశాంతంగా జరుపుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, జిల్లాలోని ఇతర మున్సిపాలిటీలలో సైతం అవసరమైన ఏర్పాట్లు కోసం అధికారులకు సూచనలు జారీ చేశామని, షాపులను 24 గంటలు నడిపేందుకు గల అవకాశాలను పరిశీలించి పోలీసు శాఖ సూచనలు అందిస్తుందని అన్నారు.
గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం విద్యుత్ సరఫరా మరింత మెరుగ్గా ఉంటుందని అన్నారు. మసీదులకు అవసరమైన మేర త్రాగునీటి సరఫరాను అందిస్తామని, ప్రతి మసీదు దగ్గర పారిశుధ్య నిర్వహణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, ఏదైనా మసీదు దగ్గర త్రాగు నీటి సరఫరా, విద్యుత్ సరఫరా సంబంధించి ఏదైనా పనులు ఉంటే వెంటనే తెలియజేయాలని, గ్రామ పంచాయతీలలో ఉన్న మసీదుల జాబితా తయారు చేసి రెగ్యులర్ గా అక్కడ పారిశుధ్య పనులు జరిగేలా పంచాయతీ అధికారి చర్యలు తీసుకోవాలని అన్నారు.
ప్రతి మసీదు వద్ద ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వైద్య ఆరోగ్యశాఖ అధికారికి సూచించారు. పండగ సందర్భంగా షాపింగ్ కోసం మార్కెట్ వద్ద పెద్ద ఎత్తున మహిళలు వచ్చే అవకాశం ఉన్నందున అవసరమైన భద్రత ఏర్పాట్లు చేస్తామని, ప్రతి మసీదు వద్ద పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ప్రతి మసీదు పరిసరాలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, మసీదు సమీపంలో ఎక్కడైనా దేవాలయాలు ఉంటే అక్కడ ఎటువంటి ఘర్షణలకు తావు లేకుండా సామరస్యంగా ఉండేలా పట్టిష్ట భద్రత ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి రంగారెడ్డి, డి సి ఎస్ ఓ రాజేందర్, డిపిఓ వీర బుచ్చయ్య, ఏసీపి కృష్ణ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.