calender_icon.png 17 January, 2025 | 5:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

17-01-2025 12:00:00 AM

కరీంనగర్, జనవరి16(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్డులో గల శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శ్రీలక్ష్మీ, పద్మావతి సమేత వెంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వచ్చే నెల రెండో తేదీ నుంచి పదో తేదీ వరకు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, షామియానాకు, క్యూ లైన్లు, బారికేడ్లు తదితర అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆలయ పరిసరాల్లో పారిశుద్ధ్యం లోపించకుండా చూడాలని మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు. ఆహార వ్యర్థాలు రోడ్లపై పడేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

భక్తుల రద్దీ దష్యా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ సమస్య రాకుండా వాహనాలను దారి మళ్లించాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని పేర్కొన్నారు. క్యూ లైన్లు ఏర్పాటు చేసి బారికేడ్లతో బందోబస్తు నిర్వహించాలన్నారు. స్టేజి, లైటింగ్, సౌండ్, డెకరేషన్ పై ప్రత్యేక దష్టి సారించాలని, షార్ట్ సర్క్యూట్ జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ఫైరింజన్ కూడా అందుబాటులో ఉంచాలన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు.  వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని డీఎంహెచ్‌ఓ వెంకటరమణకు సూచించారు. ఫస్ట్ ఎయిడ్ కిట్, ఓఆర్‌ఎస్, విటమిన్ సీ మాత్రలు, బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు అవసరమైన మాత్రలు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రభుత్వం ఆరోగ్య మహిళ కార్యక్రమం కింద చేసే ఉచిత వైద్య పరీక్షల గురించి భక్తులకు తెలిసేలా పోస్టర్లు ఏర్పాటు చేయాలని అన్నారు.

డెకరేషన్ కోసం చెట్లను తొలగించవద్దని అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల సమయంలో స్వామి వారి సేవ చేసేందుకు భక్తులు ముందుకు వస్తున్నట్లు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ కలెక్టర్ కు వివరించారు. భక్తులకు రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం అల్పాహారం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.

సమావేశంలో అదనపు కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్, నగరపాలిక కమిషనర్ చాహత్ బాజ్పేయి, శిక్షణ కలెక్టర్ అజయ్ యాదవ్, ఇన్చార్జి డిఆర్‌ఓ పవన్ కుమార్, ఆర్డీవో మహేశ్వర్, పోలీస్, విద్యుత్, మున్సిపల్, వైద్య ఆరోగ్యశాఖ, పంచాయతీ, దేవాదాయ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.