27-03-2025 12:45:26 AM
కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట. మార్చి 26(విజయక్రాంతి) : జిల్లా కేంద్రంలో ఏప్రిల్ లో 20.04.2025 నుంచి 26.04.2025 వరకు జరగబోయే సార్వత్రిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు బుధవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి తగు సూచనలు ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నారాయణపేట జిల్లా కేంద్రంలో ఎనిమిది సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్ ఎస్ సి కి సంబంధించి మూడు సెంటర్లలో 600 మంది విద్యార్థులు, అలాగే ఇంటర్మీడియట్ ఐదు సెంటర్లలో 990 విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారని తెలిపారు. ఆయా పరీక్షల పూర్తి ఏర్పాటును జిల్లా విద్యాశాఖ అధికారి పర్యవేక్షించాలని ఆమె ఆదేశించారు.
అధికారులు అందరూ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ పరీక్షలలో సెంటర్ల దగ్గర పూర్తి స్థాయి బందోబస్తు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమములో లైన్ డిపార్ట్మెంట్ జిల్లా అధికారులు, డి ఎస్ పి నల్లపు లింగయ్య ,జిల్లా విద్యాశాఖ టాస్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ , డి ఏం హెచ్ ఓ సౌభాగ్య లక్ష్మి, డి ఐ ఒ సుదర్శన్ రావు, పోస్ట్ ఆఫీస్ సూపర్‌ఇండెంట్ , డి పి ఓ అధికారి కృష్ణయ్య పాల్గొన్నారు.