calender_icon.png 20 September, 2024 | 4:00 PM

వరి ధాన్యం కొనుగోలుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి...

20-09-2024 01:49:53 PM

వరి కొనుగోలు పై సమీక్ష కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి (విజయక్రాంతి): వానాకాలం వరి ధాన్యం కొనుగోలుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం ఉదయం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వరి కొనుగోలు పై సమీక్ష నిర్వహించారు. ఈ సారి సన్న రకం వడ్లకు ప్రభుత్వం ద్వారా క్వింటాలుకు  500 రూపాయలు అదనంగా ఇస్తున్నందున జిల్లాలో భారీగా ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో నవంబర్ మొదటి వారం నుండి కోతలు ప్రారంభమై ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉన్నందున ప్రతి గ్రామ పంచాయతీలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఐ.కే.పి, ప్యాక్స్, మేప్మా వారికి కొనుగోలు కేంద్రాలు కేటాయించాలని సూచించారు. 

నాణ్యమైన వడ్లు తీసుకోవడంతో పాటు దొడ్డు రకం, సన్న రకం వేరు వేరుగా చేసుకోగలిగే  విధంగా కొనుగోలు కేంద్రాల్లో పని చేసే సిబ్బందికి పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వాలని వ్యవసాయ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించారు. ప్రతి మండల రైతు వేదికలో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో  వడ్ల నుండి చెత్త, తాలు వేరు చేసేవిధంగా ఫ్యాన్ ఏర్పాటు చేసుకోవాలని అదేవిధంగా వరి రకం పరిశీలించేందుకు మైక్రో మీటర్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మార్కెట్ శాఖ దగ్గర ఉన్న తూకం యంత్రాలను తూనికలు కొలతల శాఖ అధికారి ద్వారా తనిఖీ చేయించి దృవీకరణ పత్రం తీసుకోవాలని సూచించారు.

తేమ కొలిచే యంత్రాలను సైతం తనిఖీ చేయించి అవి సరిగ్గా పని చేస్తున్నాయా లేవా చూసుకోవాలని ఆదేశించారు. అవసరమైన మేరకు గన్ని బ్యాగులు, తాడ్పాలిన్ లు సమకూర్చుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ రెవెన్యూ యం, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ నాయక్, సివిల్ సప్లై అధికారి విశ్వనాథ్, డి.యం. సివిల్ సప్లై ఇర్ఫాన్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ఉమాదేవి, మార్కెటింగ్ అధికారి స్వరన్ సింగ్, మున్సిపల్ కమిషనర్ పూర్ణాచందర్,  తూనికలు కొలతల అధికారి తదితరులు పాల్గొన్నారు.