calender_icon.png 19 March, 2025 | 1:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలి

19-03-2025 12:00:00 AM

నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్లగొండ, మార్చి 18 (విజయక్రాంతి) :  యాసంగి ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు పూర్తి చేయాలని నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణ ఏర్పాట్లపై కలెక్టరేట్లో పౌరసరఫరాలు, వ్యవసాయశాఖ, ఇతరశాఖ అధికారులతో మంగళవారం ఆమె సమీక్ష  నిర్వహించారు. ప్రభుత్వం క్వింటా ధాన్యానికి రూ.2320 మద్దతు ధర ప్రకటించిందని తెలిపారు.

సన్నాలకు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తున్నదని గుర్తు చేశారు.  జిల్లాలో యాసంగిలో 2 లక్షల 5 వేల హెక్టార్లలో రైతులు వరి సాగు చేశారని 12 లక్షల 14 వేల 449 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశముందని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. మార్కెట్కు సుమారు 11 లక్షల 26 వేల 021  మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు.

ఇందులో మిల్లర్లు 5,68,152 మెట్రిక్ టన్నులు, సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ ద్వారా 5,57,869 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసేందుకు ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. జిల్లాలో 375 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని, వీటిలో 304 కేంద్రాలు దొడ్డు రకం, 71 కేంద్రాల్లో సన్నాలు కొనుగోలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. మార్కెట్కు వచ్చే ధాన్యం ఆధారంగా కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచుతామని కలెక్టర్ వివరించారు.

కోటి 39 లక్షల 46 వేల 725 గన్ని సంచులు సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు అందించేందుకు 14,117 టార్పాలిన్లు, 200 క్యాలిపర్లు, 253 తూకం కొలిచే యంత్రాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.

జిల్లాలో 146 రైస్ మిల్లులు ఉండగా 6.85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే సామర్థ్యం వీటికి ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మద్దతు ధర, ధాన్యం సేకరణపై రూపొందించిన ప్రచార వాల్పోస్టర్, కరపత్రాలను ఆవిష్కరించారు.