calender_icon.png 22 February, 2025 | 11:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి

22-02-2025 01:38:15 AM

గద్వాల, ఫిబ్రవరి 21 ( విజయక్రాంతి ) : జిల్లాలో ఇంటర్మీడియట్  పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ అధికారులకు ఆదేశించారు.

శుక్రవారం ఐడిఓసి కాన్ఫరెన్స్ హాల్ నందు ఇంటర్ విద్య, పాఠశాల విద్య, రెవెన్యూ, పోలీసు,రవాణా, వైద్య ఆరోగ్యం,విద్యుత్,పోస్టల్ తదితర శాఖల అధికారులతో ఇంటర్ పరీక్షల నిర్వహణపై జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 5 నుండి ప్రారంభమయ్యే ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పరీక్షా కేంద్రాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో 14 పరీక్షా కేంద్రాల్లో 8,341 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. వీరిలో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్లు 4,057, సెకండ్ ఇయర్ 4,284 మంది ఉన్నారన్నారు.పరీక్షలను నిష్పాక్షికంగా నిర్వహించేందుకు చీఫ్ సూపరిడెంట్స్, ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసి కఠినమైన నిఘా పెట్టాలని తెలిపారు.

విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా అవసరమైన మార్గాల్లో బస్సు సర్వీసులు నడిపేలా ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్లు,ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు,తగిన మందులతో మెడికల్ ఆఫీసర్,ఆశాలను అందుబాటులో ఉంచాలని వైద్య శాఖ అధికారులను సూచించారు. పరీక్షా సమయంలో ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా విద్యుత్ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో  అదనపు కలెక్టర్ నర్సింగ రావు,ఆర్డీఓ శ్రీనివాస రావు, డిఎస్పీ మొగలయ్య, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి హృదయ రాజు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిద్దప్ప,విద్యుత్ శాఖ అధికారి రమేష్ బాబు,ఆర్టీసీ అధికారి శ్రీనివాస రెడ్డి, విద్యా శాఖ శ్రీనివాస, పోస్టల్ అధికారి అయూబ్ ఖతీబ్ పాల్గొన్నారు.