- ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆదేశాలు
- 28, 29 తేదీల్లో కనకాల కట్టమైసమ్మ బోనాలు
ముషీరాబాద్, జూలై 15: ఈ నెల 28, 29 తేదీల్లో నిర్వహించే కనకాల కట్టమైసమ్మ ఆలయ బోనాల ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తిచేయాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయం తో పనిచేయాలని సూచించారు. బోనాల పండుగను పురస్కరించుకొని సోమవారం సాయంత్రం లోయర్ ట్యాంక్‌బండ్‌లోని కనకాల కట్టమైసమ్మ ఆలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉత్సవాలకు సంబంధించిన బ్రోచర్‌ను స్థానిక కార్పొరేటర్ గోడ్చల రచనశ్రీ, దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ సురేఖ, హిమాయత్ తహసీల్దార్ సంధ్యారాణి, ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ గోల్కొండ గౌతమ్‌కుమార్ పటేల్, ఆలయ ఈవో సాంబశివరావు, సర్కిల్ డీఎంసీ ఖాదర్ మోహినోద్దీన్‌లతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని అన్నారు. విద్యుత్, మంచినీటి సౌకర్యాలు కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో చిక్కడపల్లి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వీరేశం, దోమలగూడ ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.