20-03-2025 05:48:14 PM
పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నాం..
వైరాలో 4 పరీక్ష కేంద్రాలు..
పది పరీక్షకు హాజరుకానున్న 708 మంది విద్యార్థులు..
విద్యార్థులు సమయపాలన పాటించండి..
వైరా విద్యాశాఖాధికారి కొత్తపల్లి వెంకటేశ్వర్లు..
వైరా (విజయక్రాంతి): ఈనెల 21వ తేదీ నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు సర్వత్రా ఏర్పాట్లు పూర్తయ్యాయని వైరా విద్యాశాఖ అధికారి కొత్తపల్లి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఆయన వైరా విజయక్రాంతి ప్రతినిధితో మాట్లాడుతూ.. వైరా మండలంలో నాలుగు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. వైరాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల 151 విద్యార్థులు, జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ 167 మంది, తెలంగాణ గురుకుల పాఠశాల బాలికలు 190 మంది, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల బాలికలు 200 మంది మొత్తం 708 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.
ఒక్కొక్క పరీక్ష కేంద్రానికి ఒక చీఫ్ సూపరిండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్, విద్యార్థులకు ఇన్విజిలేటర్లు ఏర్పాటు చేసి పరీక్షల నిర్వహణపై తగు జాగ్రత్తలు సూచనలు తీసుకోవడం జరిగిందన్నారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులకు కలెక్టర్ సూచించినటువంటి సూచనలు తప్పక పాటించాలన్నారు. పరీక్షలు ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని కాబట్టి విద్యార్థులందరూ కూడా సమయానికి హాజరై వారికి కేటాయించబడిన పరీక్ష కేంద్రంలో విద్యార్థులు అందరూ కూడా తప్పకుండా ఎటువంటి అనుమానాలు తావు లేకుండా మంచిగా పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించాలని ఆయన ఆకాంక్షించారు.