26-02-2025 12:03:46 AM
ఖమ్మం, ఫిబ్రవరి- 25 (విజయక్రాంతి) : ఖమ్మం జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కోసం ఖమ్మం జిల్లాలో 24 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. జిల్లాలో మొత్తం 4089 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు 9 సెక్టర్ అధికారులు, 28 ప్రిసైడింగ్ అధికారులు, 27 అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, 58 ఇతర పోలింగ్ సిబ్బంది, 28 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు.
బుధవారం ఖమ్మం లోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి ఎన్నికల విధుల సిబ్బంది పోలింగ్ సామాగ్రితో పాటు పోలింగ్ కేంద్రాలకు వెళ్లనున్నారు. ఎన్నికల తర్వాత పోలింగ్ కేంద్రాల నుంచి నేరుగా నల్గొండ లోని రిసెప్షన్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు చేరుస్తారు.
8 రూట్లలో పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సిబ్బంది సామాగ్రిని తరలిస్తున్నారు.వీటి కోసం 8 ఆర్టీసీ బస్సులను సన్నద్ధం చేశారు. ఈ నెల 27న ఉదయం 8.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.ప్రతి ఓటర్ ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొని తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని జిల్లా ఉపాధ్యాయ ఓటర్లను కోరారు.