calender_icon.png 8 September, 2024 | 8:38 AM

రెండో విడత రుణమాఫీకి ఏర్పాట్లు

27-07-2024 03:41:47 AM

  1. ఆగస్టులో 2లోగా రైతుల ఖాతాల్లో జమ! 
  2. హామీని నిలబెట్టుకోనున్న రేవంత్ సర్కార్ 
  3. ఆగస్టు చివరి వారం నుంచి రైతుభరోసా పంపిణీ.. 
  4. పంచాయతీ ఎన్నికల కోసమేనని విపక్షాల విమర్శలు

హైదరాబాద్, జూలై 26 (విజయక్రాంతి): ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2లక్ష లోపు రైతు రుణమాఫీ వీలైనంత త్వరగా చేసేందుకు చర్యలు చేపడుతున్నది. ఈ నెల 18న మొదటి విడతలో రూ.లక్ష లోపు రుణం తీసుకున్న రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన ప్రభుత్వం.. ఆగస్టు 15 లోపు మూడు విడతల్లో మొత్తం మాఫీ చేస్తామని ప్రకటన చేసింది. ఆ దిశగాగా ముందుకు వెళ్తున్నది. రూ.లక్షన్నర బ్యాంకు రుణం తీసుకున్న రైతులకు ఆగస్టు 2లోగా ఖాతాల్లో నగదు జమ చేసేందుకు జాబితాను సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యేలోగా అర్హులైన రైతుల లిస్టును అందజేయాలని సూచించినట్లు సమాచారం.

దీంతో బ్యాంకుల నుంచి జిల్లా, మండల వ్యవసాయ అధికారులు వివరాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది రైతులు మండల వ్యవసాయ అధికారులను కలిసి తమ రుణాలకు సంబంధించిన పత్రాలు సమర్పించారు. ప్రభుత్వం మొదటి విడతలో 11.50లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6,080 కోట్లు జమ చేసింది. ఇటీవల ప్రకటించిన బడ్జెట్‌లో కూడా రైతు రుణమాఫీకి రూ. 26వేల కోట్లు కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ గణాంకాల ప్రకారం 40లక్షల మంది రైతులు రూ.2లక్షల లోపు రుణాలు తీసుకున్నారని, వీరికి రూ.31 వేల కోట్లు జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రెండో విడతలో సుమారు 12నుంచి 15లక్షల వరకు రైతులు ఉంటారని వ్యవసాయశాఖ అంచనా వేస్తున్నది. నాలుగు రోజుల్లో పూర్తి జాబితాపై స్పష్టత వస్తుందని, దాని ఆధారంగా నిధులు ఎంత కేటాయించాలనేది వెల్లడిస్తామని అధికారులు చెపుతున్నారు. 

ఆగస్టు చివరిలో రైతు భరోసా పంపిణీ

రుణమాఫీ పూర్తికాగానే రైతుభరోసాను ప్రభుత్వం ప్రారంభించనున్నట్లు తెలిసింది. గత ప్రభుత్వం పట్టాపాసు పుస్తకాలు ఉన్న 69 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఏటా రూ. 7,560 కోట్లు రైతుబంధు పేర జమ చేసింది. ఆ విధానం సరికాదని, పంటసాగు చేసే రైతులకే పెట్టుబడి సాయం చేయాలనే నిర్ణయంతో కాంగ్రెస్ మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసి ఉమ్మడి జిల్లాల వారీగా ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. అందులో అన్నదాతలంతా 5 నుంచి 10 ఎకరాల లోపు రైతులకు మాత్రమే రైతుభరోసా ఇవ్వాలని, పంట సాగు చేయని భూములను జాబితా నుంచి తొలగించాలని సూచనలు చేశారు. దీంతో వ్యవసాయ శాఖ వాటిని గుర్తించే పనిలో ఉన్నది. లిస్టు పూర్తికాగానే మంత్రివర్గ ఉపసంఘానికి లబ్ధిదారుల జాబితాను అందజేయనుంది. ఆగస్టు చివరిలో రైతుభరోసా డబ్బు రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. 

పంచాయతీ ఎన్నికల కోసమేనా?

రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల కోసమే ఆగమేఘాల మీద రైతు రుణమాఫీ చేస్తున్నదని విపక్షాల నేతలు విమర్శిస్తున్నారు. పంట వేసే సమయంలో పెట్టుబడి సాయం ఇవ్వకుండా రుణమాఫీపై వేగంగా ముందుకు వెళ్లడం స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకేనని అంటున్నారు. రుణమాఫీతో బలం పుంజుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నదని ఆరోపిస్తున్నారు. స్థానికంగా ఉండే  బీఆర్‌ఎస్ నాయకులు కూడా పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌లో చేరడంతో పాటు, ప్రతిపక్ష పార్టీని కోలుకోలేని దెబ్బతీయవచ్చని భావిస్తూ రైతులను మచ్చిక చేసుకోవచ్చనే ప్లాన్‌తో కాంగ్రెస్ సర్కార్ ఉన్నదని విమర్శలు చేస్తున్నారు.