calender_icon.png 23 April, 2025 | 3:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి

22-04-2025 11:41:24 PM

శనివారం వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బసిలికాలో కార్యక్రమం

హజరవనున్న ట్రంప్ సహా పలు దేశాధినేతలు

తదుపరి పోప్ ఎన్నిక ప్రక్రియకు 20 రోజులు పట్టే అవకాశం

ఓటింగ్‌లో పాల్గొననున్న నలుగురు భారతీయ కార్డినల్స్

వాటికన్ సిటీ: కేథలిక్ పవిత్ర గురువు పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇటలీ కాలమానం ప్రకారం శనివారం ఉదయం 10 గంటలకు వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బసిలికాలో నిర్వహించనున్నట్టు వాటికన్ సిటీ స్పష్టం చేసింది. సోమవారం మరణించిన పోప్ ఫ్రాన్సిస్ భౌతికకాయం ఫోటోలను కూడా తొలిసారి విడుదల చేసింది. కార్యక్రమంలో భాగంగా పోప్ ఫ్రాన్సిస్ భౌతిక కాయాన్ని బుధవారం సెయింట్ పీటర్స్ బసిలికాకు తరలించి ప్రజల సందర్శనార్థం ఉంచాలని నిర్ణయించారు. ప్రస్తుతం తొమ్మిది రోజుల పాటు సంతాపదినాలు పాటిస్తున్నారు. దీనిని నవెండియలెస్ అని పిలుస్తారు.

సాధారణంగా పోప్ అంత్యక్రియలు, ఖననం ప్రక్రియ మృతి చెందిన నాటి నుంచి నాలుగు లేదా ఆరో రోజు మధ్యలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే శనివారం అంత్యక్రియల రోజుగా నిర్ణయించారు. పోప్ ఫ్రాన్సిస్ అంతిమ సంస్కారాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా పలు దేశాధినేతలు హాజరవనున్నారు. అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ కూడా రానున్నారు. పోప్ ఫ్రాన్సిస్ మరణంపై ప్రపంచ దేశాల అధినేతలు స్పందించిన వేళ చైనా నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన వెలువడకపోవడం గమనార్హం. వాటికన్ సిటీ మధ్య కొన్నేళ్లుగా సరైన సంబంధాలు లేకపోవడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు.

ఓటు వేయనున్న నలుగురు భారతీయ కార్డినల్స్

పోప్ ఫ్రాన్సిస్ అస్తమయంతో 130 కోట్ల మంది క్యాథలిక్కులకు ప్రాతినిధ్యం వహించే వాటికన్ సిటీ చర్చికి తదుపరి పోప్ ఎవరన్న దానిపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఉన్న కార్డినళ్లలో ఒకరు ఆ పదవిని చేపట్టనున్నారు. ఇందుకోసం శతాబ్ధాలుగా అనుసరిస్తున్న రహస్య ఓటింగ్ విధానంలోనే కార్డినళ్లు కొత్త పోప్‌ను ఎన్నుకోనున్నారు. పూర్తిగా రహస్య విధానంలో జరగనున్న ఓటింగ్ ప్రక్రియ పూర్తయ్యేందుకు 15 నుంచి 20 రోజుల సమయం పట్టొచ్చు. కొత్త పోప్ ప్రావిన్స్‌ను ఎన్నుకోవడంలో భారత్ కూడా కీలకపాత్ర పోషించనుంది. కొత్త పోప్‌ను ఎన్నుకోనున్న 135 మంది కార్డినళ్లలో నలుగురు భారతీయులు కూడా ఉన్నారు. తొలుత ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్డినళ్లు పోప్ అంత్యక్రియలకు హాజరవనున్నారు.

అనంతరం సిస్టీన్ చాపెల్‌లో పాపల్ కాంక్లేవ్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన జరగనున్న ఎన్నిక ప్రక్రియలో భారత్ నుంచి కార్డినల్స్ ఫిలిప్ నెరి ఫెర్రావ్, క్లీమిస్ బసెలియోస్, ఆంథోని పూల, జార్జ్ జాకబ్ కూవ్‌కడ్ ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన 63 ఏళ్ల ఆంథోని పూల తొలి దళిత కార్డినల్‌గా చరిత్ర సృష్టించారు. కొత్త పోప్‌గా బాధ్యతలు చేపట్టేందుకు పియట్రో పరోలిన్, రాబర్ట్ ప్రివోస్ట్, రాబర్ట్ సారా, పీటర్ ఎర్డో, రీన్‌హార్డ్ మార్క్స్, మార్క్ ఓలెట్, క్రిస్టోఫ్ షోన్‌బోర్న్, లూయి ట్యాగిల్, మ్యాటియో జుప్పీ రేసులో ఉన్నారు.