calender_icon.png 27 February, 2025 | 9:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాశివరాత్రికి ఏర్పాట్లు పూర్తి

26-02-2025 12:31:28 AM

  • ముస్తాబైన శ్రీ నీలకంఠేశ్వరాలయం
  • ఉమ్మడి జిల్లాలోని శివాలయాల్లో ప్రత్యేక పూజలు
  • భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు

మణుగూరు, ఫిబ్రవరి 25 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ నీలకంటేశ్వరాలయం మహాశివరాత్రి వేడుకలకు సిద్ధమైంది. కాకతీయుల కాలం నాటి ఈ శివాలయానికి ఓ ప్రత్యేకత ఉంది.  స్వయంగా వెలసిన శివ లింగం భూగర్భం లో ఉండగా.. దానికి సమాంతరంగా పైన ప్రతిష్టించిన శివలింగం మరోకటి ఉండడం ఈ ఆలయ ప్రత్యేకత.

ఇప్పటికే దేవాదాయ శాఖ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలకు శివ-పార్వతల కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆలయాన్ని విద్యుదీపాలతో అలంకరించగా భక్తుల సౌకర్యార్థం శివలింగాన్ని దర్శించుకునేందుకు బారికేడ్ లను ఏర్పాటు చేశారు. ఆలయ పరిసర ప్రాంతాలని పరిశుభ్రం చేశారు. శివపార్వతుల కళ్యాణాన్ని తిలకించేందుకు కుర్చీలు భారీ టెంట్లను ఏర్పాటు చేశారు.

భక్తుల కోసం మంచినీటి వసతి ప్రాథమిక చికిత్స కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఆలయ పరిసర ప్రాంతాల్లో వ్యాపారులు తమ వ్యాపార సముదాయాలను ఏర్పాటు చేసి విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నారు. వేకువజామునే భక్తులు గోదావరి నది స్నానం చేసేందుకు గోదావరి సమీపంలో రహదారులతోపాటు విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. 

వేడుకల ఏర్పాట్లు పూర్తి : ఆలయ కమిటీ చైర్మన్ కూచిపూడి బాబు

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయానికి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ కమిటీ చైర్మన్ కూచిపూడి బాబు మంగళవారం తెలిపారు. గోదావరి నది తీరాన ఆలయ పరిసరాల్లో పరిశుభ్ర వాతావరణం తో పాటు విద్యుత్ దీపాలను మంచినీటి వసతిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఎటువంటి అసాంఘిక సంఘటనలు చోటు చేసుకోకుండా శివపార్వతుల కళ్యాణానికి ఆహ్వానిస్తూ బందోబస్తు ఏర్పాటు చేయాలని మనూరు డిఎస్పి రవీందర్ రెడ్డి సిఐ సతీష్ లను ఇప్పటికే కోరినట్లు పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో శివపార్వతుల కళ్యాణానికి హాజరై శివుని కృపకు పాత్రులు కావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

శివలింగంపై సూర్యకిరణాలు పడే తెలంగాణ రాష్ర్టంలో రెండో ఆలయం 

భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని పాత పాల్వంచ చింతల చెరువు కట్ట వద్ద వెలసిన శ్రీ ఆత్మలింగేశ్వర స్వామి ఆలయం శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబయింది. రాష్ర్టంలోనే శివలింగంపై సూర్యకిరణాలు పడే రెండవ ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దైవదర్శనం చేసుకుంటారు. ఈనెల 23 నుంచి శివరాత్రి మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

భక్తులకు ఎలాంటి అసౌక ర్యం లేకుండా ఆలయ కమిటీ ఏర్పాట్లు నిర్వహిస్తోంది. ఆలయ ధర్మకర్త మత్స్య శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 26వ తేదీ మహాశివరాత్రి పర్వతనం సందర్భంగా ఉదయం 4.25 నిమిషాల నుండి బ్రహ్మ ముహూర్తములో ఆత్మ లింగేశ్వర స్వామి వారికి విశేష అభిషేకాలతో పాటు కాశీ నుంచి తెచ్చిన 27 శివలింగాలకు 27 మంది దంపతులచే ప్రత్యే క అభిషేక నిర్వహించనున్నారు.

ఉదయం 9 గంటల నుంచి ద్వాదశాదిత్యుల పూజ, అరు ణ పారాయణ. సాయంత్రం 6:30 గంటలకు గో ఆలయ ప్రదక్షణ భక్తుల ఆనంద ఉత్సవాల నడుమ స్వామి వారి ఎదుర్కోలు పల్లకి సేవ. రాత్రి 8 గంటలకు వేదమంత్రాలతో మంగళ వాయిద్యాలతో భక్తుల ఆనం ద మహోత్సవాల నడుమ శివ లీల కళ్యాణ మహోత్సవము నిర్వహించనున్నారు.

రాత్రి 11:59 గంటలకు లింగోద్భవ సమయంలో శ్రీ ఆత్మలింగేశ్వర స్వామి వారికి 21 రకాల వనమూలికల చూర్ణాలతో అభిషేకము, పుష్పాభిషేకము బిల్వర్చన, అన్నాభిషేకము, పంచ హారతులు, నీరాజనం మంత్రపుష్పాలు, ఆశ్వీరచనం నిర్వహించనున్నారు. ఆలయం విద్యుత్ దీపాలతో మామిడి తోరణాలతో సుందరీకరించారు.

శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన సీఐ 

బూర్గంపాడు/అశ్వాపురం, ఫిబ్రవరి 25 : అశ్వాపురం మండలంలోని చింతిర్యాల గ్రామంలో దక్షిణ కాశీగా పేరుందిన శివాలయంలో ఈనెల 26,27,28 తేదీల్లో మూడు రోజుల పాటు నిర్వహించనున్న మహా శివరాత్రి మహోత్సవాల ఏర్పాట్లను మంగళ వారం అశ్వాపురం సిఐ జి.అశోక్ రెడ్డి పరిశీలించారు.

ఆలయ పరిసరాలు, గోదావరి నదీ పరివాహక ప్రాంతాలను సందర్శించి పలు సూచనలు చేశారు. దర్శనానికి వచ్చే సందర్శకులకు క్యూలైన్లు  ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. చక్రతీర్థ స్నానాల రోజున గోదావరి నదిలో స్నానానికి అనుకూలంగా ఉండే ప్రదేశాలను పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా  ఏర్పాటు చేయాలని, ప్రశాంతంగా ఉత్సవాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వారితోపాటు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.