calender_icon.png 13 January, 2025 | 12:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగర్‌లో నిమజ్జనానికి ఏర్పాట్లు

15-09-2024 02:22:45 AM

  1. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజాలో క్రేన్లు ఏర్పాటు 
  2. నిమజ్జనానికి అనువుగా పూడికతీత పనులు

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబరు 14 (విజయక్రాంతి): ఈ నెల 17న నిర్వహించనున్న గణేశ్ నిమజ్జనానికి జీహెచ్‌ఎంసీ, పోలీస్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజాలో క్రేన్లను ఏర్పాటు చేశారు. కాగా, మూడో రోజు నుంచే వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు భక్తులు హుస్సేన్ సాగర్‌కు తరలివచ్చారు. దీంతో హుస్సేన్ సాగర్‌లో పూడిక ఏర్పడడంతో మూడ్రోజులుగా పూడికతీత పనులు చేపట్టారు. ఇప్పటి వరకు ప్రత్యేక వాహనాల ద్వారా 6 వేల టన్నుల పూడికను తొలగించారు.

పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. 

నిమజ్జనం నేపథ్యంలో 17న విగ్రహాల ఊరేగింపు, ట్రాఫిక్ నియంత్రణపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ రూట్ మ్యాప్ విడుదల చేశారు.ఉదయం 6 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. 

ఊరేగింపు మార్గాలు..

  1. ప్రధాన ఊరేగింపు బాలాపూర్ నుంచి గుర్రం చెరువు ట్యాంక్ కట్ట మైసమ్మ టెంపుల్ మీదుగా చాంద్రాయణగుట్ట ఫ్లుఓవర్, ఎంబీఎన్‌ఆర్ ఎక్స్ రోడ్డు, ఫలక్‌నుమా రైల్వే ఓవర్ బ్రిడ్జ్, నాగుల్‌చింత, చార్మినార్, మదీనా, అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, అబిడ్స్ క్రాస్ రోడ్డు, బషీరాబాద్, లిబర్టీ జంక్షన్, ఎన్టీఆర్ మార్గ్ నుంచి నెక్లెస్ రోడ్డుకు ఉంటుంది. 
  2. సికింద్రాబాద్ నుంచి వచ్చే విగ్రహాల ఊరేగింపు సంగీత్ థియేటర్, ప్యాట్నీ, ప్యారడైజ్, ఎంజీ రోడ్డు, రాణిగంజ్, సోనాబాయి మసీదు, ట్యాంక్‌బండ్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డుకు చేరుకుంటాయి. అలాగే చిలకలగూడ ఎక్స్ రోడ్డు నుంచి వచ్చే విగ్రహాలు గాంధీ ఆసుపత్రి, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, నారాయణగూడ ఫ్లు ఓవర్, వై జంక్షన్, హిమాయత్‌నగర్ వైపు నుంచి లిబర్టీ చౌరస్తా వద్ద ప్రధాన ఊరేగింపులో కలుస్తాయి. 
  3. ఉప్పల్ ప్రాంతం నుంచి వచ్చే విగ్రహాల ఊరేగింపు రామంతాపూర్, శ్రీరమణ జంక్షన్, 6 నంబర్ జంక్షన్, తిలక్‌రోడ్డు, శివం రోడ్డు, ఓయూ ఎన్‌సీసీ గేట్, విద్యానగర్ టీ జంక్షన్, ఫీవర్ హాస్పిటల్, బర్కత్‌పుర ఎక్స్ రోడ్డు నుంచి వెళ్తుంది. వైఎంసీఏ నుంచి నారాయణగూడ ఎక్స్ రోడ్డుకు చేరుతుంది. అలాగే దిల్‌సుఖ్‌నగర్ నుంచి వచ్చే విగ్రహాలు ఐఎస్ సదన్, సైదాబాద్, చంచల్‌గూడ, నల్గొండ క్రాస్‌రోడ్డులో కలుస్తాయి. పెద్ద విగ్రహాలు మూసారాంబాగ్ నుంచి అంబర్‌పేట్ వైపునకు మళ్లిస్తారు. తార్నాక వైపు నుంచి వచ్చే విగ్రహాలు ఓయూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ రోడ్డు, అడిక్‌మెట్ మీదుగా విద్యానగర్, ఫీవర్ ఆసుపత్రి మార్గంలో చేరుతాయి.  
  4. టోలిచౌకి, రేతిబౌలి, మెహదీపట్నం వైపు నుంచి వచ్చే ఊరేగింపు మాసబ్‌ట్యాంక్, అయోధ్య జంక్షన్, నిరంకారి భవన్, ద్వారకా హోటల్ జంక్షన్, ఇక్బాల్ మీనర్ మీదుగా ఎన్టీఆర్ మార్గంలో కలుస్తాయి. ఎర్రగడ్డ వైపు నుంచి వచ్చే ఊరేగింపు ఎస్‌ఆర్ నగర్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్ మీదుగా మెహదీపట్నం నుంచి వచ్చే ఊరేగింపు నిరంకారీ భవన్‌లో చేరి ఎన్టీఆర్ మార్గంలో కలుస్తాయి. అలాగే టప్పాచబుత్ర, ఆసిఫ్‌నగర్ నుంచి వచ్చే వాహనాలు సీతారాంబాగ్, బోయగూడ కమాన్, వోల్గా హోటల్, అఘాపురా(సిండికేట్ బ్యాంకు), గోషామహల్ బారాదరి, అలాస్కా, మలకుంట జంక్షన్ మీదుగా ఎంజే మార్కెట్ వద్ద ప్రధాన ఊరేగింపులో కలుస్తాయి. 
  5. ప్రధాన ఊరేగింపు మార్గంలో విగ్రహాలు తీసుకెళ్లే వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని సీపీ స్పష్టం చేశారు. నిమజ్జనాన్ని చూసేందుకు వచ్చే సందర్శకులకు ఎన్టీఆర్ స్టేడియం, కట్టమైసమ్మ దేవాలయం, పబ్లిక్ గార్డెన్స్, ఆదర్శనగర్ రోడ్డు, బీఆర్‌కే భవన్, జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం, ఖైరతాబాద్ జంక్షన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్, ఎంఎంటీఎస్ ప్రాంతాలలో పార్కింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.