గజ్వేల్ (విజయక్రాంతి): గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో బతుకమ్మ దసరా పండుగల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మున్సిపల్ చైర్మన్ ఎన్ సి. రాజమౌళి తెలిపారు. గురువారం గజ్వేల్ మహంకాళి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు చాడ నంద బాలశర్మతో కలిసి విలేకరులతో మాట్లాడారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ వ్యాప్తంగా ఈరోజు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గజ్వేల్ పాండవుల చెరువు, ప్రజ్ఞాపూర్ పూర చెరువు, క్యాసారం పెద్ద చెరువు, రాజిరెడ్డిపల్లి కుంట తదితర చెరువుల వద్ద బతుకమ్మ పండుగలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ పారిశుద్ధ్య ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.
బతుకమ్మ నిమజ్జనం కోసం పారిసిద్ద కార్మికులను కూడా ప్రజలకు సహకరించేలా చెరువుల వద్ద ఉండేట్లు ఆదేశించామన్నారు. విద్యుత్, ఇరిగేషన్, పోలీస్ శాఖలతో సమన్వయం చేస్తూ మున్సిపల్ అధికారులు ఉత్సవాలను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు అన్నారు. అలాగే మహంకాళి ఆలయ ప్రధాన అర్చకులు నందబాలశర్మ మాట్లాడుతూ.. శనివారం సాయంత్రం4.30 గంటలకు గజ్వేల్ మహంకాళి ఆలయ ప్రాంగణంలో శమీ పూజ నిర్వహించడం జరుగుతుందని గజ్వేల్ మహంకాళి అమ్మవారు అపరాజిత అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తారన్నారు. కార్యక్రమంలో పట్టణ ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలన్నారు.