07-03-2025 01:26:06 AM
జిల్లా సమీక్ష సమావేశంలో అధికారులతో కలెక్టర్ జితేష్ వి పాటిల్
భద్రాచలం, మార్చి 6 (విజయ క్రాంతి) : శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం ,మహా పట్టాభిషేకం మహోత్సవాలు తిలకించడానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సంబంధిత అధికారులు తమకు కేటాయించిన విధులను పగడ్బందీగా నిర్వహించాలని,కళ్యాణ వేడుకలు దిగ్విజయంగా పూర్తయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. గురువారం సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరములో శ్రీసీతారామచంద్రస్వామి కళ్యాణం, పట్టాభిషేకం మహోత్సవాలకు చేపట్టవలసిన కార్యాచరణపై ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ సీతారామచంద్రస్వామి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు, ఏరు ఫెస్టివల్ విజయ వంతంగా జరగడానికి అధికారులు కలిసికట్టుగా ఉండి విధులు ఎలా నిర్వహించారో మిథిలా స్టేడియంలో జరుగు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం పట్టాభిషేకం మహోత్సవాలు జరగడానికి నెల రోజుల సమయం ఉన్నందున అందరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారికి అప్పగించిన పనులు సక్రమంగా నిర్వహించాలని అన్నారు.
కళ్యాణం వీక్షించడానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేడుకలు వీక్షించేందుకు భక్తులు ఒక సెక్టార్ నుంచి వేరే సెక్టార్ కి వెళ్లకుండా పటిష్ట భారీకేడ్లు ఏర్పాటు చేయాలని భక్తులకు ఆన్లైన్ ద్వారా 75% టిక్కెట్లు కేటాయించాలని, 25 శాతం మాన్యువల్ గా అందుబాటులో ఉంచుకోవాలని దేవస్థానం ఈవో కు సూచించారు. అలాగే లాడ్జిలు బుక్ చేసుకునే విధంగా సౌకర్యం కల్పించాలని, అవసరమైతే పోలీస్ సహకారం తీసుకోవాలని, సెక్టర్ లలో భారీకేడ్లు నిర్వహణ ఆర్ అండ్ బి,పోలీస్ శాఖ వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని భారీ కేడ్లు పటిష్టంగా జరిగేలా చూడాలని, నాసిరకంగా భారీకేడ్ల నిర్వహణ చేసే ఏజెన్సీలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
మిథిలా స్టేడియంలో పర్మినెంట్ గా మంచినీటి కొళాయిలు ఏర్పాటు చేసే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆర్డబ్ల్యూఎస్, దేవస్థానం డి ఈ కు సూచించారు. అలాగే వాహనాల పార్కింగ్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ముఖ్యంగా అగ్ని ప్రమాదాల నివారణకు అగ్నిమాపక వాహనాలను ఎస్టీమ్ గిరీష్ పరికరాలను సిద్ధంగా ఉంచాలన్నారు. భక్తులు గోదావరిలోకి వెళ్లకుండా రిస్కుటీములను అందుబాటులో ఉంచుకోవాలనన్నారు. నాటు పడవలను, గజయితగాళ్లను సిద్ధంగా ఉండేలా సంబంధిత అధికారులు చూసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఏ ఎస్ పి రోహిత్ రాజ్, డి ఆర్ డి ఓ విద్యాచందన, ఆర్డీవో దామోదర్ రావు, కొత్తగూడెం ఆర్డీవో మధుసూదన్, దేవస్థానం ఈవో రమాదేవి మరియు వివిధ శాఖలకు చెందిన అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.