calender_icon.png 24 October, 2024 | 2:53 AM

ఆర్నెళ్ల ఆదాయం 34 శాతమే

24-10-2024 12:09:34 AM

  1. బడ్జెట్ అంచనాల్లో గత ఏడాది కంటే భారీగా తగ్గిన పన్నేతర రెవెన్యూ, ఎక్సైజ్ సుంకం
  2. ౩౦% తగ్గిన మూలధన వ్యయం
  3. 15% అప్పులు తగ్గించుకున్న సర్కారు
  4. 24% పెరిగిన వడ్డీ చెల్లింపులు
  5. రాబడి ఖర్చు వ్యత్యాసం 15,752 కోట్లు
  6. సెప్టెంబర్ నివేదిక విడుదల చేసిన కాగ్

హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వానికి సొంత రాబడులు భారీగా తగ్గాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-2సెప్టెంబర్ మధ్య కాలంలో బడ్జెట్ అంచనాల్లో  34.10 శాతం మాత్రమే ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. వాస్తవానికి తొలి ఆరు నెలల్లో 50 శాతం వరకు రాబడిని ప్రభుత్వం ఆశించింది.

కానీ అనుకున్న విధంగా ఆదాయం రాలేదు. 15.9 శాతం లోటు ఏర్పడింది. గత ఏడాది ఇదే సమయానికి 40.27 శాతం రెవెన్యూ రాబడులు వచ్చాయి. గత ఏడాది కంటే ఈ సారి బడ్జెట్ అంచనాల్లో దాదాపు 6 శాతం ఆదాయం తగ్గింది. ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలానికి సంబంధించిన ఆర్థిక నివేదికను బుధవారం కాగ్ విడుదల చేసింది.

అందులో కీలక విషయాలను వెల్లడించింది. మూలధన రాబడులు గత ఏడాది కంటే దాదాపు 11 శాతం తగ్గాయి. రెవెన్యూ, మూలధన రాబడులు కలిపి బడ్జెట్ అంచనాల్లో గత ఏడాది ఇదే సమయానికి 45.62 శాతం వసూలైతే.. ఈ సారి 39.41 శాతం మాత్రమే ఉండటం గమనార్హం. గత ఏడాదితో పోలిస్తే అప్పులను ప్రభుత్వం భారీగా తగ్గించుకుంది.

2023-24 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అంచనాల్లో ఇదే సమయానికి 81.95 శాతం అప్పులను బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసింది. కానీ కాంగ్రెస్ సర్కారు గత ఏడాది కంటే దాదాపు 15 శాతం తగ్గించుకుంది. అప్పులను తగ్గించుకున్నా వడ్డీల భారం మాత్రం విపరీతంగా పెరిగింది.

గత ఏడాది ప్రభుత్వం వడ్డీల కింద ఇదే సమయానికి రూ.11,265.13 కోట్లను చెల్లించింది. ఈ సారి రూ.13,187.41 కోట్లను కట్టింది. ఇది బడ్జెట్ వడ్డీ చెల్లింపుల అంచనాల్లో ఏకంగా 74.38 శాతం కావడం గమనార్హం.

ఖర్చులు కూడా భారీగా తగ్గాయ్

ఆశించిన మేరకు రాబడి రాకపోవడంతో ప్రభు త్వం బడ్జెట్ అంచనాల ప్రకారం ఖర్చు పెట్టలేకపోతోంది. రెవెన్యూ వ్యయం గత ఏడాది ఆరు నెలల్లో రూ.47,227 కోట్లు ఖర్చు చేస్తే.. ఈసారి సర్కారు రూ.41,802.76 కోట్లను మాత్రమే ఖర్చు చేసింది.

ఇది బడ్జెట్ అంచనాల్లో రూ.41.28 శాతం మాత్ర మే. ఇక మూలధన వ్యయంలోనూ భారీగా వ్యత్యా సం ఉంది. 2023-24లో మూలధన వ్యయం రూ.22,489 కోట్లు అయితే.. ఈసారి కేవలం 9,924.35 శాతం మాత్రమే సర్కారు ఖర్చు చేసింది. ఇది బడ్జెట్ అంచనాల్లో 29.64 శాతం మాత్రమే.  

నివేదికలోని కొన్ని కీలకాంశాలు..

* పన్ను ఆదాయం ఆరు నెలల్లో రూ.68,905.80 కోట్లు వచ్చింది. ఇది బడ్జెట్ అంచనాల్లో 41.91 శాతం కాగా.. గత ఏడాది 43.73 శాతం వసూలైంది. 

* జీఎస్టీ వసూళ్లు కూడా ఈసారి ఆశించిన మేర రాలేదు. గత ఏడాది బడ్జెట్ అంచనాల్లో 44.45 శాతం రాబడి రాగా.. ఈసారి 42.21 శాతం మాత్రమే వచ్చింది. 

* సేల్స్ ట్యాక్స్ ఆదాయం ఈ సారి భారీగా పెరిగింది. గత ఏడాది ఏప్రిల్ మధ్య కాలంలో బడ్జెట్ అంచనాల్లో 37.75 శాతం మాత్రమే రాబడి వచ్చింది. ఈసారి 48.08 శాతానికి పెరిగిందని కాగ్ నివేదిక చెప్పింది. 

* సెప్టెంబర్‌లో కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు.

* ఉద్యోగులకు ఇచ్చే లోన్లు, అడ్వాన్స్‌లు కూడా పెరిగాయి. గతేడాది ఇదే సమయానికి రూ.4,407 కోట్లను లోన్లు, అడ్వాన్సుల రూపంలో ఇచ్చిన ప్రభుత్వం.. ఈ సారి 6,879.78 కోట్లను మంజూరు చేసింది.

* ఈ ఆరు నెలల్లో ప్రభుత్వం జీతాల కోసం రూ.21,279.58 కోట్లు, పెన్షన్ల కోసం రూ.8,560 కోట్లు, సబ్సిడీ కింద రూ.6,376.51 కోట్లను చెల్లించింది.

* మొత్తం మీద చూసుకుంటే ఈ ఆరు నెలల కాలంలో ప్రభుత్వానికి మొత్తం ఆదాయం రూ.1.08 లక్షల కోట్లు కాగా.. ఇప్పటివరకు సర్కారు చేసిన వ్యయం రూ.1.01 లక్షల కోట్లు కావడం విశేషం. అంటే ప్రభుత్వం వచ్చిన ఆదాయాన్ని పూర్తిస్థాయిలో ఖర్చుపెట్టలేక పోయింది.

24 శాతం తగ్గిన ఎక్సైజ్ సుంకం 

ఎక్సైజ్ సుంకం సెప్టెంబర్ వరకు రూ.9,492.98 కోట్ల్లు వసూలైంది. ఇది బడ్జెట్ అంచనాల్లో 37.06 మాత్రమే. కానీ గత ఏడాది ఇదే సమయానికి బడ్జెట్ అంచనాల్లో 61.63 శాతం ఎక్సైజ్ సుంకం వసూలు కావడం విశేషం. ప్రభుత్వం భారీగా ఆదాయం వస్తుందనుకున్న శాఖ ఇది. ఈ విభాగంలో దాదాపు 24 శాతం రాబడి తగ్గింది. 

ద్రవ్యలోటు గత ఏడాది కంటే 11 శాతం పెరిగింది. గత ఏడాది ఇదే సమయానికి బడ్జెట్ అంచనాల్లో ద్రవ్యలోటు 55.89 శాతం ఉంటే.. ఈ సారి ఏకంగా 66.06 శాతానికి పెరిగింది.