25-04-2025 12:43:46 PM
శ్రీనగర్,(విజయక్రాంతి): జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగి ఉగ్రవాదుల దాడిలో 26 మంది మరణించారు. ఈ ఉగ్రదాడిలో ఎక్కువగా పర్యాటకులు మరణించిన నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించడానికి ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం కాశ్మీర్ చేరుకున్నారు. ఆర్మీ చీఫ్ తో పాటు నార్తర్న్ కమాండ్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఎంవీ సుచింద్ర కుమార్ కూడా ఉన్నారు. ఆర్మీ కమాండర్లతో ఆర్మీ చీఫ్ సమావేశం నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా పరిస్థితిని చీఫ్ ఆఫ్ ఆర్మ్డ్ స్టాఫ్ (COAS) సమగ్రంగా సమీక్షిస్తున్నారని, మంగళవారం జరిగిన ఉగ్రదాడి తర్వాత భద్రతా పరిస్థితి, తీసుకున్న చర్యల గురించి అత్యున్నత ఆర్మీ కమాండర్లు ఆయనకు వివరిస్తారని వారు తెలిపారు.
సెలవులపై వెళ్లిన జవాన్లు వెంటనే రిపోర్టు చేయాలని ఉన్నతాధికారలను ఆదేశించారు. దీంతో పారామిలిటరీ బలగాలకు సెలవులు రద్దు చేసిన సైన్యం శ్రీనగర్ విమానాశ్రయంలో భద్రత కట్టుదిట్టం చేసింది. జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి పాకిస్తాన్ ఆయుధ కాల్పులకు పాల్పడిన 24 గంటల్లోపే ఆర్మీ చీఫ్ పర్యటన జరగడం గమనార్హం. ఇదిలా ఉండగా.. పవల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా ఇవాళ ఢిల్లీ మార్కెట్లు బంద్ ను ప్రకటించాయి.