* పిస్టళ్లు, తపంచా స్వాధీనం
* వివరాలు వెల్లడించిన రాచకొండ సీపీ సుధీర్‌బాబు
మేడ్చల్, జనవరి15: రాచకొండ కమిషనరేట్ పరిధిలో అక్రమంగా ఆయుధాలు విక్రయించేందుకు యత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద రెండు పిస్టళ్లు, ఒక తపంచా,10 తూటాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు బుధవార కేసు వివరాలను వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్ కు చెందిన హరేకృష్ణ యాదవ్(26) ఇంటర్ వరకు చదివి 2019 లో సోదరుడితో కలిసి ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చి బీబీనగర్‌లోని ఒక కంపెనీలో కొంతకాలం పనిచేశాడు. మూడేళ్ల తర్వాత స్వగ్రామానికి వెళ్లి వ్యవసాయం చేశాడు. వీరి గ్రామం బీహార్‌కు సరిహద్దులో ఉండటంతో అక్కడ అక్రమంగా ఆయుధాలు తయారు చేసేవారితో పరిచయం ఏర్పడింది.
అక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేసి హైదరాబాద్‌లో అవసరమున్నవారికి ఎక్కువ ధరకు విక్రయించాలనే ఉద్దేశంతో మూడు ఆయుధాలతో ఇటీవల నగరానికి వచ్చాడు. బుధవారం అంబేద్కర్ నగర్ బస్టాప్ వద్ద అనుమానాస్పదంగా తిరగుతుండటాన్ని గమనించిన జవహర్‌నగర్, భువనగిరి పోలీసులు అతడి పట్టుకొని విచారించగా ఆయుధాల విక్రయాల విషయాన్ని బయటపెట్టాడు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.