calender_icon.png 3 October, 2024 | 4:01 AM

పకడ్బందీగా వృద్ధుల పోషణ చట్టం

02-10-2024 02:32:54 AM

వయోవృద్ధుల ఫిర్యాదుల కోసం ప్రత్యేక యాప్

ఆర్టీసీ బస్సుల్లో రాయితీలు కల్పిస్తాం

రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 1 (విజయక్రాంతి): వృద్ధుల పోషణ, సంక్షేమ చట్టాన్ని తమ ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా మంగళవారం నగరంలోని రవీంద్రభారతిలో నిర్వహించిన వేడుకలో ఆమె మాట్లా డారు.

వృద్ధులు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు నమోదు చేసేందుకు ప్రత్యేకంగా యాప్ తీసుకువస్తామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీలు ఇస్తామన్నారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో చర్చిస్తామని హామీ ఇచ్చారు.  పిల్లల ప్రేమకు నోచుకోని తల్లిదండ్రులకు తిరిగి వారి ఆస్తులను అప్పగించే విధంగా చర్యలు చేపడతామన్నారు. 

వృద్ధుల హక్కులపై అవగాహన కల్పించేలా కలెక్టరేట్లలో బోర్డులను ఏర్పాటు చేస్తామన్నారు. వయోవృద్ధుల కోసం ఉన్న టోల్‌ఫ్రీ నంబర్ 14567 సేవలను మరింత పటిష్ట పరుస్తామన్నారు. సమావేశంలో రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, వయోవృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్‌జండర్ పర్సన్స్ సాధికారత శాఖ డైరెక్టర్ శైలజ తదితరులు పాల్గొన్నారు.