కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు..
పక్కాగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు..
నిజామాబాద్ (విజయక్రాంతి): శాసన మండలి ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. శాసన మండలి పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలతో కూడిన పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో చేపట్టిన చర్యల గురించి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సీఈఓ దృష్టికి తెచ్చారు. జిల్లాలో పట్టభద్రులకు సంబంధించి 33 మండలాలలోని 48 పోలింగ్ కేంద్రాల పరిధిలో 30593 మంది ఓటర్లు, ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి 33 పోలింగ్ కేంద్రాల పరిధిలో 3529 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి కట్టుదిట్టంగా అమలయ్యేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు.
ఎన్నికల కోడ్ పక్కాగా అమలయ్యేలా నిరంతర పర్యవేక్షణ జరుపుతూ, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు సంబంధించి పాటించాల్సిన నిబంధనల గురించి ఎన్నికల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించిన హోర్డింగులు, వాల్ రైటింగ్, జెండాలు, ప్రకటనలను తొలగించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఎక్కడ కూడా ఏ చిన్న అలసత్వానికి సైతం తావులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. అదేవిధంగా ఎం.సీ.ఎం.సీ కమిటీని ఏర్పాటు చేశామని, పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మాధ్యమాలలో వచ్చే ప్రసారాలను నిశితంగా పరిశీలన జరిపేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు. ఆయా రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి అవసరమైన అనుమతులను నిబంధనలకు అనుగుణంగా జారీ చేస్తామన్నారు. ఈ.సీ మార్గదర్శకాల మేరకు నిఘా బృందాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వీ.సీ అనంతరం కలెక్టర్ సంబంధిత అధికారులకు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై కీలక సూచనలు చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను తప్పిదాలకు తావులేకుండా పక్కాగా రూపొందించాలని ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న టీచర్స్, పట్టభద్రుల ఓటరు దరఖాస్తులను పరిశీలించి ఈ నెల 7వ తేదీలోపు పరిష్కరించాలని గడువు విధించారు. పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అవసరమైన అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగే పోలింగ్ ప్రశాంత వాతావరణంలో, పూర్తి పారదర్శకంగా జరిగేలా ఏర్పాట్లు చేసుకోవాలని హితవు పలికారు. ఎన్నికల సిబ్బందిని నియమిస్తూ, వారికి శిక్షణ అందించేందుకు మాస్టర్ ట్రైనర్లను గుర్తించాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమయ్యే బ్యాలెట్ బాక్సులను సరిచూసుకోవాలని, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లకు అనువైన ప్రదేశాలను ఎంపిక చేయాలని ఆదేశించారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని, ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.