- లైవ్ రేటింగ్‌లో కెరీర్ అత్యుత్తమం
న్యూఢిల్లీ: తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేశి అంతర్జాతీయ వేదికపై మరోసారి సత్తా చాటాడు. జెర్ముక్ వేదికగా జరిగిన స్టెపాన్ అవగ్యాన్ మొమోరియల్ చెస్ టోర్నీలో అర్జున్ మరొక రౌండ్ మిగిలి ఉండగానే విజేతగా నిలిచాడు. ఈ విజయంతో అర్జున్ చెస్ లైవ్ రేటింగ్స్‌లో నాలుగో స్థానానికి ఎగబాకి కెరీర్ అత్యుత్తమం అందుకున్నాడు. టోర్నీ విజేతగా నిలిచి 9 పాయింట్లు సాధించిన అర్జున్ మొత్తంగా 2779.9 ఎలో రేటింగ్స్ కలిగి ఉన్నాడు.
అర్జున్ కంటే ముందు మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే) , హికారు నకామురా, ఫాబియానో కరునా (అమెరికా) ముందున్నారు. ఇక స్టెపాన్ అవగ్యాన్ టోర్నీలో మంగళవారం జరిగిన 8వ రౌండ్‌లో అర్జున్ తెల్ల పావులతో బరిలోకి దిగాడు. 63 ఎత్తుల్లో రష్యా గ్రాండ్‌మాస్టర్ వొలోడర్ ముర్జిన్‌ను చిత్తు చేశాడు. 8 రౌండ్లు పూర్తయ్యేసరికి నాలుగు విజయాలు.. నాలుగు డ్రాలతో 6 పాయింట్లు సాధించిన అర్జున్ టాప్‌లో నిలిచాడు. మరొక రౌండ్ మిగిలి ఉన్నప్పటికీ పాయింట్ల పరంగా అంతరం ఎక్కువగా ఉండడంతో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ విజేతగా నిలిచాడు. ఇక ఫైనల్ రౌండ్‌లో అర్జున్ అమెరికా గ్రాండ్‌మాస్టర్ మాన్యుల్ పెట్రోస్యాన్‌ను ఎదుర్కోనున్నాడు.