calender_icon.png 8 April, 2025 | 3:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరి థీమ్ సాంగ్ చాలా బాగుంది: నాగ్‌అశ్విన్

06-04-2025 12:09:18 AM

‘పేపర్ బాయ్’ చిత్రంతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు జయశంకర్ వంగ. ఆయన దర్శకత్వంలో మరో సినిమా రూపొందుతోంది. ‘అరి’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక. ఆర్‌వీరెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, డాక్టర్ తిమ్మప్ప నాయుడు పురిమెట్ల నిర్మిస్తున్నారు.

వినోద్‌వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుకున్న ఈ సినిమా త్వరలో థియేటర్ల ద్వారా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శక నిర్మాతలు ఈ మూవీ థీమ్ సాంగ్‌ను శనివారం విడుదల చేశారు. ‘భగభగ..’ అనే ఈ పాట.. స్టార్ డైరెక్టర్ నాగ్‌అశ్విన్ చేతుల మీదుగా సంగీతప్రియుల ముంగిట్లోకి వచ్చింది.

వనమాలి సాహిత్యం అందించిన ఈ గీతాన్ని అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యంలో షణ్ముక ప్రియ, రోహిత్ పీవీఎన్‌ఎస్ ఆలపించారు. ‘మనిషేనా నువ్వు.. ఏమైపోతున్నావు.. మృగమల్లె మారి దిగజారిపోయావు.. భగభగ మండే నీలో ఏదో సెగ.. అంతులేని ఏంటి దగా..’ అంటూ సాగుతున్న ఈ పాట ఆలోచింపజేస్తోంది.

పాట విడుదల సందర్భంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘అరిషడ్వర్గాల గురించి చర్చించే కథతో డైరెక్టర్ జయశంకర్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆ మూవీ థీమ్ సాంగ్ చాలా బాగుంది’ అన్నారు. ఈ చిత్రానికి డీవోపీ: కృష్ణప్రసాద్, శివశంకర వరప్రసాద్; పాటలు: కాసర్ల శ్యామ్, వనమాలి, కళ్యాణ్ చక్రవర్తి; ఎడిటర్: జీ అవినాష్.