calender_icon.png 23 October, 2024 | 11:55 PM

చదువుకున్న ప్రాంతంతో స్థానికత చెల్లదు

28-08-2024 12:10:26 AM

  1. ఈ నిబంధనతో స్థానికులకే నష్టం
  2. మెడికల్ అడ్మిషన్లపై హైకోర్టులో పిటిషనర్ల వాదనలు

హైదరాబాద్, ఆగస్టు 27 (విజయక్రాంతి): చదువుకున్న ప్రాంతాన్ని బట్టి వైద్య కళాశాలల్లో అడ్మిషన్లకు స్థానికతను నిర్దారించడం చెల్లదని పిటిషనర్ల తరపు న్యాయ వాదులు హైకోర్టు దృష్టికి తెచ్చారు. స్థానిక కోటా రిజర్వేషన్లపై ప్రస్తుత వివాదం నడవడం లేదని, అదెలా కల్పించాలన్న అం శంపైనే వివాదమని అన్నారు. రాజ్యాంగం ప్రకారం స్థానికతను గుర్తించాలని కోరారు. మెడికల్ అడ్మిషన్ల నిబంధనలను సవరిస్తూ రూల్ 3 ను చేర్చుతూ ప్రభుత్వం గత నెల 19న జారీ చేసిన జీవో 33ను సవాల్ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.

ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు డీవీ సీతారాంమూర్తి, బీ మయూర్‌రెడ్డి, కే వివేక్‌రెడ్డి వాదనలు వినిపించారు. నీట్ నోటిఫికేషన్ జారీ అయ్యాక రాష్ట్ర ప్రభుత్వం స్థానికత నిబంధనల్లో మార్పు చేయడం చెల్లదని చెప్పారు. స్థానికతకు సంబంధించి గత ఏడాది ఇదే హైకోర్టు వెలువరించిన తీర్పునకు విరుద్ధంగా ప్రభు త్వ జీవో ఉన్నదని పేర్కొన్నారు. ప్రస్తుత నిబంధన ప్రకారం అడ్మిషన్‌కు ముందు వరుసగా నాలుగేళ్లు తెలంగాణలో చదివి ఉండాలని నిబంధన తీసుకువచ్చారని తెలిపారు.

దీంతో స్థానికులకే తీవ్ర నష్టం వాటి ల్లుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఆలిండియా సర్వీసు ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరని.. అలాంటి వారి పిల్లలకు స్థానికతను నిరాకరించడం చెల్లదంటూ వెలువరించిన తీర్పు లను కూడా ప్రస్తావించారు. దీనిపై అడ్వొకేట్ జనరల్ ఎ సుదర్శన్‌రెడ్డి స్పందిస్తూ అలాంటి అభ్యర్థులను స్థానిక కోటా కిందనే పరిగణనలోకి తీసుకుంటామని, వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కోర్టు సమయం ముగిసిపోవడంతో ప్రభుత్వం తరఫు వాదనల నిమిత్తం విచారణను బుధవారానికి వాయిదా వేసింది. స్థానికతపై ఈ నెల 14న విచారించిన హైకోర్టు సవరించిన నిబంధనతో నిమిత్తం లేకుండా శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రంతో దరఖాస్తులను స్వీకరించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.