28-02-2025 12:55:37 AM
తీర్పు వాయిదా వేసిన హైకోర్టు
హైదరాబాద్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): తన ఫోన్ ట్యాప్ చేశారంటూ రియల్టర్ చక్రధర్ గౌడ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయాలంటూ మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారంతో హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. తీర్పు వాయిదా పడింది. హరీశ్‌రావును అరెస్ట్ చేయొద్దంటూ కోర్టు గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది.
బార్ అసోసియేషన్ల ఎన్నికలపై యథాస్థితి
రాష్ట్రంలోని బార్ అసోసియేషన్ల ఎన్నికల నిర్వహణపై యథాతథస్థితిని కొనసాగించాలంటూ హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బార్ అసోసియేషన్ పాలకవర్గం పదవీ కాలాన్ని పొడిగించకపోవడంపై రంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్‌తోపాటు మరో 23 అసోసియేషన్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.
దీనిపై ఉన్నత న్యాయస్థానం విచారణ జరపగా.. పిటిషనర్ల తరఫున అడొకేట్ రవీందర్‌రెడ్డి వాదనలు వినిపించారు. కేసుపై మార్చి 4న పూర్తిస్థాయిలో వాదనలు వింటానని తెలిపిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. అప్పటి వరకు ఎన్నికలకు సంబంధించి యథాతథస్థితి కొన సాగించాలని ఆదేశించింది.