27-02-2025 05:06:55 PM
అధికార పార్టీ నేతలను వదిలి తమనే టార్గెట్ చేస్తారా అని ప్రశ్నించిన బిజెపి నాయకులు
టెంట్లు తొలగించి బిజెపి, కాంగ్రెస్ నాయకులను పంపించిన పోలీసులు
భిక్కనూర్ పోలింగ్ కేంద్రం వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత
కామారెడ్డి,(విజయక్రాంతి): పోలీసులు తమనే టార్గెట్ చేస్తున్నారని బిజెపి నాయకులు(BJP leaders) ప్రశ్నించిన ఘటన గురువారం కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలో చోటుచేసుకుంది. భిక్కనూరు పోలింగ్ కేంద్రం(Bikkanur Polling Station) వద్ద పట్ట భద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓట్లు వేసేందుకు వస్తున్న వారిని పిలిచి తమ అభ్యర్థికి ఓటు వేయాలంటూ అభ్యర్థిస్తున్న తరుణంలో వివాదం తలెత్తింది. పోలింగ్ కేంద్రానికి సమీపంలో 100 మీటర్ల పరిధిలో టెంటు వేసుకొని ఓటర్లను పిలిచి స్లిప్పులు రాసి ఇవ్వడంతో కాంగ్రెస్ నాయకులు(Congress leaders) పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ నిబంధనల కనుగుణంగా వ్యవహరించాలని బిజెపి నాయకులను స్థానిక ఎస్సై ఆంజనేయులు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది సూచించారు.
దీంతో బిజెపి నాయకులు తమకు ఒకరకం అధికార పార్టీ నాయకులకు ఒక్క తీరుగా వ్యవహరించడం ఏమిటని పోలీసుల ను ప్రశ్నించారు. ఎన్నికల నియమావలిని ఉల్లంఘించి టెంట్లు వేశారని తొలగించాలని పోలీసులు బిజెపి నాయకులను ఆదేశించారు. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి టెంటు వేశారని తమను మాత్రమే టెంటును తొలగించాలని పేర్కొనడం ఎంతవరకు సబబు అని అడిషనల్ ఎస్పి చైతన్య రెడ్డి కి బిజెపి నాయకులు ఫిర్యాదు చేశారు. అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి పర్యవేక్షించారు. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు వేసిన టెంట్ తొలగించే వరకు తాము ఇక్కడే ఉంటామని బిజెపి నాయకులు పట్టుబట్టారు.
సీఐ సంపత్ కుమార్ తో బిజెపి నాయకులు మాట్లాడి ఎస్సై ఆంజనేయులు కాంగ్రెస్ నాయకులకు వంత పాడుతూ బిజెపి నాయకు లు వేసినా టెంట్ ను తొలగించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఎస్సై ఆంజనేయులు తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని బిజెపి నాయకులు పేర్కొన్నారు. నిబంధనలు అన్ని పార్టీలకు ఒకటే విధంగా ఉంటాయి కానీ ఒక పార్టీకి అనుకూలంగా మరొక పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం పోలీసులకు తగదని బిజెపి నాయకులు పేర్కొన్నారు. సీఐ సంపత్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలను పరిశీలించి మెదులుకోవాలని ఇరు పార్టీల నాయకులకు సూచించారు. టెంట్లు తొలగించడంతోపాటు నాయకులను అక్కడి నుంచి పంపించారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఒకే చోట గుమ్మిగూడి ఉండరాదని సీఐ సంపత్ కుమార్ సూచించారు. వెళ్లకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీంతో కాంగ్రెస్ బిజెపి నాయకులు వెళ్లిపోవడంతో వివాదం సద్దుమణిగింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట మండల కేంద్రంలోని పోలింగ్ స్టేషన్ వద్ద బిజెపి నాయకులకు ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.