calender_icon.png 11 January, 2025 | 3:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫైనల్లో అర్జెంటీనా

11-07-2024 12:10:00 AM

సెమీస్‌లో కెనడాపై విజయం

గోల్‌తో మెరిసిన మెస్సీ

కోపా అమెరికా కప్

ప్రతిష్ఠాత్మక కోపా అమెరికా కప్‌ను వరుసగా రెండోసారి అందుకునేందుకు అర్జెంటీనా అడుగు దూరంలో నిలిచింది. నాకౌట్ సమరంలో విజృంభించిన సారథి లియోనల్ మెస్సీ టోర్నీలో తొలిసారి గోల్‌తో మెరవగా.. సమష్టి ప్రదర్శనతో డిఫెండింగ్ చాంపియన్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇప్పటికే 15 సార్లు కోపా చాంపియన్‌గా నిలిచిన అర్జెంటీనా ముందు కెనడా ఆటలు సాగలేదు. సోమవారం జరగనున్న ఫైనల్లో అర్జెంటీనా గెలిస్తే వరుసగా మూడు మేజర్ టైటిల్స్ సాధించిన జట్టుగా చరిత్ర సృష్టించనుంది.

ఈస్ట్ రూథర్‌ఫోర్డ్ (అమెరికా): కోపా అమెరికా కప్‌లో అర్జెంటీనా జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో అర్జెంటీనా 2-0తో కెనడాపై విజయం సాధించింది. అర్జెంటీనా తరపున జూలియన్ అల్వారెజ్ (ఆట 21వ నిమిషం), లియోనల్ మెస్సీ (51వ ని.లో) చెరో గోల్ సాధించారు. వరుసగా రెండోసారి ఫైనల్లో అడుగుపెట్టిన డిఫెండింగ్ చాంపియన్ 16వ టైటిల్‌ను అందుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. గోల్ చేయకుండానే టోర్నీని ముగిస్తాడేమో అనుకున్న తరుణంలో అర్జెంటీనా నాయకుడు లియోనల్ మెస్సీ ఎట్టకేలకు గోల్‌తో మెరిశాడు. మ్యాచ్‌లో ఆది నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చిన అర్జెంటీనాకు తొలి గోల్‌ను జూలియన్ అల్వారెజ్ అందించాడు.

రోడ్రిగో డి పాల్ నుంచి లాంగ్ పాస్ అందుకున్న అల్వారెజ్.. కెనడా గోల్ కీపర్ మాక్సిమే క్రిపూ కాళ్ల సందుల్లో నుంచి బంతిని గోల్ పోస్ట్‌లోకి తరలించి అర్జెంటీనాను 1-0తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. మైదానంలో పాదరసంలా కదిలిన మెస్సీ రెండో అర్థ భాగంలో అర్జెంటీనాకు రెండో గోల్ అందించాడు. ఎన్జో ఫెర్నాడేంజ్ నుంచి పాస్ అందుకున్న మెస్సీ కెనడా ప్లేయర్ ఇస్మాయిల్ కోనేను బోల్తా కొట్టిస్తూ నాలుగు గజాల దూరం నుంచి బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపించాడు. ఈ గోల్‌తో మెస్సీ అంతర్జాతీయ కెరీర్‌లో 109 గోల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. మెస్సీ కంటే ముందు పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో (130 గోల్స్) తొలిస్థానంలో ఉన్నాడు.

ఆడుతూనే ఉంటా: మెస్సీ

కెనడాతో సెమీఫైనల్ అనంతరం మెస్సీ తన రిటైర్మెంట్‌పై మరోసారి స్పందించాడు. ‘ముందే చెప్పినట్లు నేను ఆడుతూనే ఉంటా. భవిష్యత్తుపై పెద్దగా ఆలోచన లేదు. నాకు 37 ఏళ్లు. ఫుట్‌బాల్ ఆడే సత్తా మిగిలే ఉంది. ముగింపు దేవుడికే తెలియాలి. కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడబోతున్న ఏంజెల్ డీ మారియాకు ఆల్ ది బెస్ట్. సహచరుడికి ఘనమైన వీడ్కోలు ఇస్తాం’ అని మెస్సీ పేర్కొన్నాడు. కాగా అర్జెంటీనాకు చెందిన మరో సీనియర్ ప్లేయర్ ఏంజెల్ డీ మారియా కోపా అమెరికా కప్ ఫైనల్ అనంతరం ఆటకు వీడ్కోలు పలకనున్నాడు. 2008లో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అరంగేట్రం చేసిన ఏంజెల్ డీ మారియా అర్జెంటీనా తరఫున 144 మ్యాచ్‌ల్లో 31 గోల్స్ సాధించాడు. 2021 కోపా అమెరికా కప్, 2022లో అర్జెంటీనా ఫిఫా వరల్డ్ కప్ గెలవడంలో మారియాది కీలకపాత్ర. ‘కోపా అమెరికా కప్ ఫైనల్ నా చివరి మ్యాచ్. 16 ఏళ్ల కెరీర్ ఎంతో గొప్పగా సాగింది. చెప్పడానికి ఏం లేదు. వీడ్కోలుకు ఇదే సరైన సమయం’ అని మారియా తెలిపాడు.