రేపు ఆస్ట్రేలియా, భారత్ మ్యాచ్
గెలిస్తే సెమీస్‌కు హర్మన్ సేన
మహిళల టీ20 వరల్డ్ కప్
షార్జా: ప్రతిష్ఠాత్మక మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం హర్మన్ సేన కీలకపోరుకు సిద్ధమైంది. గ్రూప్-ఏలో భారత్ తమ చివరి మ్యాచ్‌లో పటిష్టమైన ఆస్ట్రేలియాను ఎదుర్కోనుంది. ఎలాంటి అ డ్డంకులు లేకుండా సెమీస్ చేరాలంటే ఆస్ట్రేలియాపై గెలుపు తప్పనిసరి.
డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను కంగారు పెడతారా.. లేక పడతారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు భారత్ ఆడిన మూడింటిలో రెండు నెగ్గి.. ఒక దానిలో ఓడింది.
న్యూజిలాండ్‌పై ఓటమి పాలైన హర్మన్ సేన.. ఆ తర్వాత వరుసగా పాకిస్థాన్, లంకను ఓడించి సెమీస్ రేసులోకి దూసుకొచ్చింది. ఇక మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఇరుజట్లు ఆరుసార్లు తలపడగా.. ఆసీస్ నాలుగుసార్లు, భారత్ రెండుసార్లు నెగ్గాయి
ఫామ్‌లోకి మంధాన, హర్మన్
తొలి రెండు మ్యాచ్‌ల్లో పెద్దగా ప్రభావం చూపని టీమిండియా స్టార్ స్మృతి మంధాన శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అర్ధ సెంచరీతో టచ్‌లోకి వచ్చింది. ఇక భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మాత్రం నిలకడగా రాణిస్తూ ఆడిన మూడు మ్యాచ్‌లలో ఒక అర్ధ సెంచరీతో కలిపి 96 పరుగులు చేసింది. భారత బౌలర్లలో మన హైదరాబాద్ సివంగి అరుంధతీ రెడ్డి గర్జిస్తోంది.
ఆసీస్ హ్యాట్రిక్
దుబాయ్: టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకుంది. శుక్రవారం గ్రూప్ పాకిస్థాన్‌ను 9 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 19.5 ఓవర్లలో 82 పరుగులకు ఆలౌటైంది. అలియా (26) టాప్ స్కోరర్. అష్లే గార్డనర్ 4 వికెట్లు పడగొట్టింది. అనంతరం 83 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 11 ఓవర్లలో వికెట్ నష్టపోయి ఛేదించింది.