calender_icon.png 16 March, 2025 | 8:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంప్యూటర్ అతిగా వాడుతున్నారా..?

16-03-2025 12:00:00 AM

ప్రస్తుత టెక్నాలజీకాలంలో కంప్యూటర్లు, ల్యాప్ ట్యాప్‌లు జీవితంలో భాగం గా మారాయి. కొందరి ఉద్యోగాలు వీటి మీదే ఆధారపడి ఉంటున్నాయి. తర చూ ఇంటర్‌నెట్‌పై గడిపేవారూ గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుంటున్నారు. ఇలా ఎక్కువసేపు డిజిటల్ పరికరాల తెరను చూస్తే కళ్లు ఒత్తిడికి గురై, అలసిపోవచ్చు. కొన్నిసార్లు చూపూ దెబ్బతినొచ్చు. కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటించటం మంచిది. 

ప్రకాశవంతమైన లైట్ల వెలుగులో పనిచేస్తే కష్టపడి చూడాల్సి ఉంటుంది. దీంతో కళ్లు త్వరగా, బాగా అలసిపోతాయి. కాబట్టి తగినంత వెలుతురు ఉండేలా చూసుకోవాలి. 

తల మీద నేరుగా కాంతి పడినా, కిటికీ నుంచి ప్రకాశ వంతమైన ఎండ పడినా తెరను చూసేటప్పుడు కళ్లకు ఇబ్బంది కలుగుతుంది. అందువల్ల వీటిని నివారించుకోవాలి. 

ఒకవేళ కిటికీ తెరవటం తప్పనిసరైతే పక్క వైపు నుంచి కాంతి పడేలా చూసుకోవాలి. కిటికీకి ఎదురుగా గానీ కిటికీకి వీపు చేసి గానీ కూర్చోవద్దు. కర్టెన్లు వేస్తే బయటి వెలుగు తగ్గించుకోవచ్చు.

డిస్‌ప్లే మీద యాంటీగ్లేర్ స్క్రీన్ బిగిస్తే కళ్లకు హాయిగా ఉంటుంది. ఒకవేళ కళ్లద్దాలు ధరిస్తే యాంటీ రిఫ్లెక్టింగ్ పూత ఉన్నవి ఎంచుకోవాలి. ఇది తెర నుంచి ప్రతిఫలించే కాంతి కళ్లకు అంతగా చేరకుండా అడ్డుకుంటుంది. 

అదేపనిగా తెరలను చూడటం తగదు. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి పక్కకు తిరిగి 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువులను కనీసం 20 సెకండ్ల పాటు చూడాలి. దీంతో కంట్లోని కండరాలు వదులవుతాయి. అలసట తగ్గుతుంది.

చేసే పని నుంచి తరచూ విరామం తీసుకోవాలి. ప్రతి గంటకూ కనీసం 10 నిమిషాల సేపు విశ్రాంతి తీసుకుంటే మంచిది. కంప్యూటర్ మీద పనిచేయటం వల్ల తలెత్తే మెడ, వీపు, భుజాల నొప్పి తగ్గటానికిది తోడ్పడుతుంది. కళ్ల మీద ఒత్తిడిని తగ్గిస్తుంది.