calender_icon.png 22 October, 2024 | 11:00 PM

ప్యాకెట్ పాలు వాడుతున్నారా!

22-10-2024 12:00:00 AM

పాలు అనేక పోషక విలువలను కలిగి ఉంటాయి. పాలలో ఉండే క్యాల్షియం ఎముకలను దృఢంగా చేస్తుంది. అందుకే చిన్న పిల్లలు, వృద్ధులు ప్రతిరోజూ ఒక గ్లాసు పాలు తాగాలని చెబుతుంటారు. పాలను మరిగించిన తర్వాతే ఉపయోగించడం ఒక పద్ధతి. కానీ ప్యాకెట్ పాలను ఎక్కువ సేపు మరిగించకూడదని చెబుతున్నారు డైటీషియన్లు. దానికి కారణం ఏంటో చూద్దాం.. 

* పాలను పాశ్చరైజేషన్ చేసిన తర్వాతే ప్యాకింగ్ చేస్తారు. అంటే పాలలోని ప్రమాదకర బ్యాక్టీరియాను నాశనం చేయడానికి ప్రత్యేక ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తారు. అంటే 71 డిగ్రీల సెల్సియస్ వద్ద వాటిని వేడి చేసి మళ్లీ సున్నా డిగ్రీల వద్ద చల్లబరుస్తారు.

అనంతరం వాటిని ప్రాసెస్ చేసి ప్యాకింగ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల వివిధ రకాల అనారోగ్యాలకు కారణమయ్యే బ్యాక్టీరియా చనిపోతుంది. ఈ విధానంలో మైక్రో ఆర్గానిజం సంఖ్య గణనీయంగా తగ్గించి పాలను వాడుకునేందుకు అనువుగా మారుస్తారు. ఇలాంటి పాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 

* 71 డిగ్రీల సెల్సియస్ వద్ద వేడి చేసి చల్లార్చిన పాలను మళ్లీ అతిగా వేడి చేస్తే అందులోని పోషక విలువలు దెబ్బతింటాయని నిపుణులు చెబుతున్నారు. ప్యాకెట్ పాలను బాగా మరిగించడం వల్ల అందులోని విటమిన్ సి, విటమిన్ బి, ప్రోటీన్లు తగ్గిపోతాయి. ప్యాకెట్ బాగా ఉండి.. సరిగ్గా స్టోర్ చేసి ఉంటే ప్యాకెట్ పాలను మరిగించకుండా ఉపయోగించుకోవడమే మంచిది. 

* ప్యాకెట్ పాలు కాకుండా నేరుగా డైరీ నుంచి తీసుకొచ్చిన పాలను మాత్రం కచ్చితంగా వేడి చేయాల్సిందే. లేకపోతే హానికర బ్యాక్టీరియా శరీరంలోకి చేరుతుంది. ప్యాకెట్ పాలు పొంగే వరకు కాకుండా గోరు వెచ్చగా వేడి చేస్తే సరిపోతుంది. దీంతో బ్యాక్టీరియా నాశనం అయి.. అవసర మైన పోషకాలు మాత్రమే మిగులుతాయి. 

* ప్యాకెట్ పాలను వాడేవారు కొన్ని జాగ్రత్తలు తప్పని సరిగా పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ప్యాకెట్ పాలను కేవలం ఐదు నిమిషాలు వేడి చేస్తే సరిపోతుంది. అంతకు మించి వాటిని వేడి చేయవద్దు అని నిపుణులు చెబుతున్నారు. ఏరోజు పాలను ఆరోజే వాడుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.