నగ్న సత్యాలు చెబ్తున్నా కదాని
నేను బట్టలే తొడుక్కోననుకోవడం
మీ అమాయకత్వం
చీకటిని శరీరానికి పూసుకుని
వెన్నెలను సేవిస్తూ
విరహ గీతాలాలపించడం
నా ప్రాచీనత్వం.
నీళ్లలో నీళ్లు కలిపితే తేడా
ఏముండదని
ఇద్దరం కలిసి దాహం తీర్చుకోవడమే
ఆదిమ ఆధునికత్వం
ఆమె పొడి దగ్గు సంకేతానికి
మిగల పండిన గులాబీలను దూసి
పది వేళ్ల మధ్యా పొదిగితే
నాలుగు అరచేతులూ పండటమే
సృష్టిత్వం
మూణ్ణాల్ల ముచ్చటయ్యాక
ఏ ఇద్దరికీ ఒకేసారి
మూడు కుదరక పోయినా
ఇద్దరు ముగ్గురు కావడం
ముగ్గురు నల్గురు కావడమే
అనాది బహుళత్వం
ఇక అద్దాల కిటికీకి ఆవల
వెన్నెల్లోనో, వేకువల్లోనో
పక్షులు రెక్క విప్పుకోవడం
విధిలేని వలసత్వం.
కలలపై పెర్ఫ్యూమ్ కొట్టి
ప్లాస్టిక్ కవర్లో పెట్టి
లోపల బట్టల అల్మార్లో దాచేయడం
తెలుగు సంసారత్వం
చివరాఖరికి పండిన ఆకులు
నేలకు రాలబోతే, దెబ్బలు
తగలకుండా
తమ భుజాల మీదుగా
సాగనంపడమే
మిగిలిన దయత్వం
అయినా, కళ్లు తెరిచిన లోకులెవ్వరూ
సత్యం కానరానట్టు
గడుసుగా జారుకోవడమే
భిన్నత్వంలో ఏకత్వం.
- దేశరాజు