calender_icon.png 8 October, 2024 | 12:09 PM

గృహ రుణం తీసుకుంటున్నారా!

01-09-2024 12:00:00 AM

సొంత ఇల్లు ఏర్పర్చుకోవాలన్నది ప్రతీ ఒక్కరి కల. కానీ పెరుగుతున్న ప్రాపర్టీ ధరలు, గృహ రుణాల వడ్డీ రేట్ల నేపథ్యంలో మీకు అవసరమైనంత గృహ రుణ మొత్తాన్ని కనిష్ఠ వడ్డీ రేటుతో పొందడం పెద్ద సవాలు. మీ కలల గృహాన్ని కొనేందుకు మీ బడ్జెట్‌కు మించి అధిక రుణాన్ని తీసుకుంటే తదుపరి నెలల్లో ఆర్థిక ఇబ్బందుల్లో పడతారు.

మీరు కొనదల్చిన గృహానికి మీరు ఆశిస్తున్న రుణ మొత్తానికి బదులు బ్యాంకర్ తక్కువ రుణ మొత్తాన్ని ఆఫర్ చేస్తే మీకు నిరాశ ఆవహిస్తుంది. అప్పుడు మీకు రెండు మార్గాలే ఉంటాయి. అధిక వడ్డీ రేటుతో కావాల్సినంత రుణాన్ని తీసుకోవడం లేదా రుణం తీసుకుని ఇల్లు కొనాలన్న ఆశ వదులుకోవడం. అయితే భారం మరీ ఎక్కువకాకుండా అధిక రుణ మొత్తం పొందే మార్గాలూ ఉన్నాయి. అవి.. 

ఆర్థిక పరిస్థితుల సమీక్ష

మీ ఆదాయ పనరులు, ఇల్లు గడవడానికి అయ్యే బడ్జెట్,  చెల్లింపుల భారం తదితర ఆర్థిక పరిస్థితుల్ని ఒక సారి సమీక్షించుకోండి. రుణానికి దరఖాస్తు చేసేముందుగా భారీ మొత్తంలో డౌన్ పేమెంట్ (గృహం కొనుగోలుకు రుణంతో సంబంధం లేకుండా మీరు చెల్లించే నగదు) చేయదగిన మొత్తం మీ వద్ద ఉందో లేదో చూసుకోండి. మీ వద్దనున్న డబ్బు ఆస్తి విలువలో 20 శాతం లేదా అంతకుమించి డౌన్ పేమెంట్ చేయగలిగేంత ఉంటే మీరు కోరుకున్నంత రుణాన్ని, సరసమైన వడ్డీ రేట్లకు ఇచ్చేందుకు బ్యాంక్‌లు మొగ్గుచూపుతాయి. చాలామంది వద్ద అవసరమైన డౌన్‌పేమెంట్ చేయడానికి తగిన పొదుపు మొత్తం ఉండదు. అందుచేత రుణానికి దరఖాస్తు చేసేముందు తగిన పొదుపు నిల్వను ఉంచుకోవాలి.

వివిధ బ్యాంక్‌ల ఆఫర్లు చూడండి

మీ వద్దకు తొలుత వచ్చిన లోన్ ఆఫర్‌తోనే సరిపెట్టుకోకండి. ఉత్తమమైన ఆఫర్ కోసం వివిధ బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు, హౌం ఫైనాన్స్‌లను అన్వేషించి, వడ్డీ రేట్లు, రుణ షరతులు, ఫీజులు తెలుసుకునేందుకు వాటి వద్ద నుంచి కోట్స్ తీసుకోండి. ఈ కోట్స్‌ను పోల్చిచూసుకుని, మీకు వ్యయం తక్కువయ్యేలా, ఆదానిచ్చే ఆఫర్‌ను ఎంచుకోండి.

క్రెడిట్ స్కోరుపై కసరత్తు

గృహ రుణం కోసం మీరు బ్యాంక్‌ను సంప్రదించేముందు మీ క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేసుకోండి. మీ క్రెడిట్ రిపోర్ట్ కాపీ ఒకటి తీసుకుని, అందులో మీరు సవరించాల్సిన వ్యత్యాసాలు ఏవైనా ఉన్నాయేమో సరిచూసుకోండి. పాత రుణాల్ని, చెల్లింపుల్ని పరిశీలించండి. అటువంటివి  మీ క్రెడిట్ స్కోరు తగ్గడానికి కారణమవుతాయి. ఈ అంశాలపై మీరు దృష్టిపెట్టి క్రెడిట్ స్కోర్‌ను 750ని మించి సాధించుకోగలుగుతారు.

దీనితో తక్కువ వడ్డీ రేటుతో అధిక రుణ మొత్తం పొందేందుకు అర్హులవుతారు.  మీ ఆదాయంతో పోలిస్తే రుణం నిష్పత్తి అధికంగా ఉంటే ప్రస్తుత రుణాల్ని చెల్లించివేయడం ద్వారా నిష్పత్తిని తగ్గించుకోగలుగుతారు. మీ నెలవారీ ఆదాయానికి తగ్గ నిష్పత్తిలో ప్రస్తుత రుణం ఉంటే మీరు కొత్త రుణాల్ని పొందే మార్గం సుగమం అవుతుంది.

డాక్యుమెంట్లు దగ్గర పెట్టుకోండి

రుణ దరఖాస్తు ప్రక్రియ అవసరమైన డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోండి. సేలరీ స్లిప్‌లు, గత రెండు మూడేండ్ల ఆదాయపు పన్ను  రిటర్న్‌లు, మీ ఆర్థిక స్థిరత్వాన్ని, క్రమ ఆదాయ ఆర్జనను సూచించే బ్యాంక్ స్టేట్‌మెంట్లు,  యుటిలిటీ బిల్స్, రెంటల్ అగ్రిమెంట్స్ తదితరాలతో కూడిన రెసిడెన్షియల్  ప్రూఫ్‌ను దగ్గరపెట్టుకోండి. చివరగా..దీర్ఘకాలానికి మీరు చెల్లింపు చేయలని ప్రాపర్టీని ఎంచుకోవద్దు. మీ ఆదాయ పరిమితులను గుర్తించి, మీకు లభించే రుణ మొత్తానికి సరిపోయే గృహాన్ని ఎంపికచేసుకోండి.