ప్రభుత్వ విద్యాసంస్థల్లో మధ్యాహ్న భోజనం వికటించిన ఘటనలపై ఆగ్రహం
ప్రాణాలు పోతేనే స్పందిస్తారా?.. పేదోళ్ల పిల్లలంటే లెక్కలేదా?
- మీ పిల్లలు అనారోగ్యానికి గురైతే ఇలానే చేస్తారా?
- వివరాలివ్వడానికి వారం సమయం ఎందుకు?
- ఎన్బీడబ్ల్యూ జారీచేస్తే క్షణాల్లో వస్తారు!
- పలు ప్రశ్నలతో అధికారులు, ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన డివిజన్ బెంచ్
* అధికారులకు మానవత్వం లేదా.. అన్నం దొరికితే చదువుకోవచ్చని భవిష్యత్‌పై ఆశలతో బడికి వచ్చిన విద్యార్థులకు కలుషిత ఆహారం పెడతారా?.. ప్రభుత్వ స్పందన కూడా ఏమీ లేకపోవడం దారుణమైన విషయం. మేమైతే వెంటనే డీఈవోను సస్పెండ్ చేస్తాం.
హైకోర్టు
హైదరాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి): ప్రభుత్వ విద్యాసంస్థల్లో మధ్యా హ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలపై హైకోర్టు తీవ్రం గా స్పందించింది. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేసింది.
ఒకే హైస్కూల్లో ఒకే వారంలో ఏకంగా మూడుసార్లు మధ్యాహ్న భోజనం వికటించడంపై విస్మయాన్ని వ్యక్తంచేసింది. ఇదేనా అమాయక విద్యార్థులకు ఆహారం అందించే విధానమని ప్రశ్నించింది. విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురవుతుంటే పాలకులు, అధికారుల్లో కదిలికలేదని మండిపడింది. విద్యార్థులు వాంతులు, విరోచనాలు చేసుకుని అనారోగ్యానికి గురవుతుంటే అధికారులు నిద్ర పోతున్నారా అని ఘాటు వ్యాఖ్య చేసింది.
ఇలాంటి వాటిపై పాలకులు, అధికారులు వెంటనే స్పందించి దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే ఎలాగని ప్రశ్నించింది. విద్యార్థుల ప్రాణాలు పోతేగానీ స్పందించరా అని నిలదీసింది. నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడు తోందని వ్యాఖ్యానించింది. నారాయణపేట జిల్లా మాగనూరు జెడ్పీ స్కూల్లో మూడుసార్లు విద్యార్థులు ఆస్పత్రిపాలైన ఘటనపై వివరాలు ఇచ్చేందుకు వారం రోజులు గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరడంతో మరింతగా మండిపడింది.
వాయిదా వేసే ప్రసక్తే లేదని, నారాయణపేట డీఈవో ఇతర ఆఫీసర్ల దగ్గర సెల్‌ఫోన్లు లేవా? అని ప్రశ్నించింది. ‘అధికా రులు నిద్రపోతున్నారా, అధికారులకు మానవత్వం లేదా.. అన్నం దొరికితే చదువుకోవచ్చని భవిష్యత్‌పై ఆశలతో బడికి వచ్చిన విద్యార్థులకు కలుషిత ఆహారం పెడతారా?.. అధికారులు నిద్ర మత్తులో జోగుతున్నారా, ప్రభుత్వ స్పందన కూడా ఏమీ లేకపోవడం దారుణ విషయం.
మేమైతే వెంటనే డీఈవోను సస్పెండ్ చేస్తాం’.. అని హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. ప్రభుత్వం తరఫున వాదించేందుకు అదనపు అడ్వొకేట్ జనరల్ విచారణకు రావా లని తేల్చిచెప్పింది. దీంతో పది నిమిషాల కు అదనపు ఏజీ మహమద్ ఇమ్రాన్ ఖా న్ విచారణకు హాజరై పూర్తి వివరాలను మధ్యాహ్నం భోజన విరామం తర్వాత ఇస్తామని చెప్పడంతో హైకోర్టు సమ్మతించింది.
ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలుతీరు సరిగ్గా లేదంటూ హైదరాబాద్‌కు చెందిన కే అఖిల్ శ్రీగురుతేజ దాఖలు చేసిన పిల్‌ను చీఫ్ జస్టిస్ ఆలోక్ అరాదే, జస్టిస్ జే శ్రీనివాసరావులతో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం విచారించింది. మాగనూరులో 20, 24, 26 తేదీల్లో వరసగా విద్యార్థులు మధ్యాహ్న భోజనం తిని ఆస్పత్రిపాలయ్యారని పిటిషనర్ లాయర్ చిక్కుడు ప్రభా కర్ చెప్పారు.
దీనిపై కౌంటర్ వేసేందుకు వారం రోజులు కావాలని ప్రభుత్వ ప్లీడర్ కోరడంతో పైవిధంగా హైకోర్టు ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారులను నిప్పులు చెరిగింది. మాగనూరు 70 కిలోమీటర్ల దూరంలోనే ఉందని ప్రభాకర్ చెప్పారు. అక్కడ నుంచి ఆన్‌లైన్‌లో సమాచారాన్ని తెప్పించుకునేందుకు టెక్నికల్‌గా అన్ని సౌకర్యాలు ఉన్నా యని చెప్పారు.
దీంతో.. ఫోన్‌లో డీఈవో నుంచి సమాచారాన్ని తెప్పించుకునేందుకు వారం రోజులు సమయం ఎందుకని హైకోర్టు ప్రశ్నించింది. గడువు కోరడానికి సిగ్గుపడాలని వ్యాఖ్యానించింది. అధికారులకు కూడా పిల్లలు ఉన్నారని, మన పిల్లలకు అలా జరిగితే ఎలా వ్యవహరిస్తామో ఒకసారి ఆలోచన చేయాలంది. విద్యార్థులు చచ్చిపోతేనే మీలో కదలిక వస్తుందా అని అధికారులను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్య చేసింది.
నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ) జారీ చేస్తే ఈరోజే రెక్కలు కట్టుకుని ఇక్కడికి సమాచారంతో వచ్చి వాలుతారని కూడా వ్యాఖ్యానించింది. పేదల పిల్లలను ప్రైవేట్ స్కూల్‌లో చదివించలేక ప్రభుత్వ స్కూళ్లకు పంపితే అధికారులు నాణ్యతలేని ఆహారాన్ని పెడతారని ప్రశ్నించింది.
మధ్యాహ్న భోజనం తర్వాత అదనపు ఏజీ వాదనలు వినిపిస్తూ, స్థానికంగా తయారుచేసిన కుర్ కురేను విద్యార్థులు కొనుకున్ని తినడంతో అస్వస్థతకు గురయ్యారని, రెండుసార్లు మాత్రమే స్కూల్‌లో మధ్యాహ్న భోజనం వల్ల ఇబ్బందులు పడ్డారన్నారు. మధ్యాహ్న భోజనం తినడం వల్ల జరిగిన ఘటనలకు బాధ్యులైన అధికారులు సస్పెండ్ అయ్యారని చెప్పారు. మధ్యాహ్న భోజనం తయారీదారులను కూడా మార్చినట్లు వివరించారు.
మాగనూరులో ఈనెల 20న 50 మంది, 24న 70, 26న 27 మంది చొప్పున మధ్యాహ్న భోజనం వికటించి అస్వస్థతకు గురయ్యారని పిటిషనర్ లాయర్ చిక్కుడు ప్రభాకర్ చెప్పారు. కరీనంగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లిలో కూడా ఈ నెల 24న 20 మంది విద్యార్థులు ఆస్పత్రిపాలయ్యారన్నారు. వాదనల అనంతరం ప్రభుత్వం తీసుకున్న చర్యలపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించిన హైకోర్టు డివిజన్ బెంచ్ తదుపరి విచారణను డిసెంబర్ 2కు వాయిదా వేసింది.