తల్లిదండ్రులు విడిపోవడం లేదా ఎవరో ఒకరు చనిపోయిన సందర్భాల్లో మిగిలిన ఆ ఒక్కరూ ఒంటరిగానే పిల్లల బాధ్యత సంపూర్ణంగా తీసుకోవాలి. ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనే ధైర్యంతో పిల్లలను పెంచగలిగితే ఆ చిన్నారులు బలమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులుగా ఎదుగుతారు. లేదంటే చిన్నారులు శారీరక, మానసిక అనారోగ్యల బారిన పడే ప్రమాదం ఉందంటున్నారు మానసిక నిపుణులు. ఒంటరిగా పిల్లలను పెంచాల్సి వచ్చినప్పుడు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవాలి.
చిన్నారులకు ఎక్కువ సమయం కేటాయించడం, ఆర్థిక ఇబ్బందులు, సామాజికపరమైన ఒత్తిడి వంటి ఛాలెంజ్లను తట్టుకుని నిలబడాలి. భర్త లేదా భార్య తన నుంచి దూరంగా లేక శాశ్వతంగా దూరమైనప్పుడు మానసిక ఆందోళన, ఒత్తిడి, కుంగుబాటు, కోపం, స్వీయసానుభూతి మొదలవుతాయి. వీటన్నింటినీ దూరం చేసుకోగలగాలి. ఉద్యోగం, క్షణం తీరికలేకుండా పనిచేయడం, తమ పిల్లల సంరక్షణపై శ్రద్ధ చూపించడం, జీవితాన్ని సమన్వయం చేసుకోవడం వంటివి సాధన చేయాలి. అలాగే ఇలాంటి సందర్భాల్లో చాలామంది పిల్లలు కుంగుబాటుకు గురవుతారు. ఇలా జరగకుండా ఉండాలంటే.. పిల్లలను మరింత ప్రేమించాలి. వారు చెప్పే ప్రతి విషయాన్నీ సహనంగా వినాలి.