calender_icon.png 4 October, 2024 | 8:58 AM

పేదలపైనా మీ ప్రతాపం?

04-10-2024 02:18:13 AM

బడా బాబుల ఫాంహౌస్‌లు కూల్చే దమ్ముందా?

ఒవైసీకి చెందిన ఫాతిమా కాలేజీని ఎందుకు కూల్చడం లేదు? 

పేదల జోలికి వస్తే.. మీ ప్రభుత్వం కూలడం ఖాయం 

హామీల అమలు నుంచి తప్పించునేందుకే డ్రామాలు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధ్వజం 

హైదరాబాద్, అక్టోబర్ 3(విజయక్రాంతి): పేదల ఇండ్లను కూల్చుతున్న సీఎం రేవంత్‌రెడ్డికి, బడా బాబుల ఫామ్‌హౌస్‌లు కూల్చే దమ్ముందా? అని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. పేదలపైనా మీ ప్రతాపం అని ఆయన మండిపడ్డారు.

గురువారం ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ డ్రైనేజీ సమస్యను తీర్చకుండా.. మూసీ సుందరీకరణ పేరుతో రూ. లక్షా యాభైవేల కోట్లను ఖర్చు చేస్తామనడం అనాలోచిత చర్య అని మండి పడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే హైడ్రా, మూసీ సుందరీకరణ తెరపైకి తెచ్చారని కిషన్‌రెడ్డి విమర్శించారు.

పేదల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చే ప్రయత్నం చేస్తే సహించేది లేదని, రాష్ట్ర ప్రభుత్వం కూలిపోక తప్పదని హెచ్చరించారు. సర్కార్ చేస్తున్న విధ్వంసాన్ని ఆపాలని, అనాలోచితంగా పేదల ఇళ్లను కూల్చొద్దని సీఎంకు లేఖ రాసినట్లు ఆయన పేర్కొన్నారు.

హైదరాబాద్‌లోని 70 శాతం డ్రైనేజీ నీళ్లు మూసీలోకి వెళ్తాయని, మూసీ సుందరీక రణ చేపడితే ఈ డ్రైనేజీ నీళ్లు ఎక్కడికి పోతాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పాతబస్తీలోని ఓవైసీకి చెందిన  ఫాతిమా కాలేజీ నిర్మాణాలకు కూల్చకుండా ఎందుకు సమయం ఇచ్చారో చెప్పాలన్నారు.

ఇందిరమ్మ రాజ్యం అన్న రాహుల్‌గాంధీ ఎక్కడున్నారని కిషన్‌రెడ్డి నిల దీశారు. పేదల ఇళ్లను కూల్చే ప్రభుత్వాన్ని దేశంలో ఏ రాష్ట్రంలోనూ చూడలేదన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లో ఆర్థిక సంక్షోభం నెలకొన్నదని, ఇక్కడి ప్రభుత్వాలు గ్యారెంటీలను అమలు చేయకుండా అవినీతి ఆరోపణలతో న్యాయ స్థానంలో విచార ణ ఎదుర్కొంటున్నాయని తెలిపారు. 

రాజకీయాల్లోకి లాగొద్దు..

మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందిస్తూ.. కుటుంబ వ్యవహారాలను రాజకీయాల్లోకి లాగడం సరికా దన్నారు. రాజకీయాల్లో దుర్భాషలాడటం కేసీఆర్ నుంచే మొదలైందని, కేటీఆర్ ముందుకు తీసుకెళ్తున్నారని ఆయన ఆరోపినించారు. అవే విధానాలను సీఎం రేవంత్ అనుసరిస్తు న్నారని, నోటికి అడ్డు అదుపు లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ హక్కుతో ఫోన్ ట్యాపింగ్ చేశారని ప్రశ్నించారు.