calender_icon.png 12 January, 2025 | 3:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఊరెళ్తున్నారా..జర భద్రం

12-01-2025 12:35:05 AM

  1. సంక్రాంతికి ఊరెళ్లెవాళ్లు జాగ్రత్తలు పాటించాలి
  2. ఠానాల్లో వివరాలు ఇవ్వాలంటున్న పోలీసులు
  3. తిరిగొచ్చే వరకు నిఘా పెడతామంటూ హామీ
  4. గ్రామాలకు తరలుతున్న నగరవాసులు

హైదారాబాద్, సిటీబ్యూరో, జనవరి ౧౧ (విజయక్రాంతి): సంక్రాంతంటే ఆ సరదానే వేరు.. అందమైన రంగోలీలు.. డూడూ బసవన్నల ఆటలు.. పండక్కొచ్చారా అంటూ ఆప్యాయమైన పలకరింపు  వాటిని ఆస్వాదించాలని, తమ సొంతూళ్లలో మనవారి మధ్య పండగ జరుపుకోవాలని అందరికీ ఉంటుంది.

దీంతో చాలా మంది సొంతూళ్లకు బయలుదేరుతారు. ఇదే అదునుగా భావించి దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తారు. ఈ సమయంలో ఇంటి తాళాలు పగులగొట్టి ఇళ్లంతా గుళ్ల చేశాకా.. లబోదిబో మొత్తుకొని పోలీసులను ఆశ్రయించినా లాభం ఉండదు. ఇలాంటి చోరీలకు చెక్ పెట్టేందుకు అప్రమత్తంగా వ్యవహరించాలని ఏళ్ల తరబడి పోలీసులు చెబుతూనే ఉంటున్నారు.

అయినా.. పోలీసులు చెప్పే విషయాన్ని అంత సీరియస్‌గా తీసుకోకపో  జరగాల్సిన నష్టం జరుగుతోంది. మీరు సంక్రాంతి సెలవులకు ఊరెళ్లినట్లయితే.. ముందస్తు సమాచారం ఇస్తే మీ ఇంటిని నిఘానీడలో ఉంచుతామంటూ హైదరాబాద్ మహానగరంలోని పోలీ  ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. ఈ క్రమంలో పలు సూచనలు, సలహాలను  పాటించాలని సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు సూచిస్తున్నారు. 

లక్షలాది మంది సొంతూళ్లకు.. 

హైదరాబాద్ మహానగరంలోని మూడు కమిషనరేట్ పరిధిలో దాదాపు 1.40 కోట్ల మంది నివసిస్తున్నారు. సుమారు 25 లక్షలకు పైగా భవనాలు ఉన్నాయి. యేటా జనవరిలో వచ్చే సంక్రాంతి పండగను తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి పండుగ ఊరూరా జాతరను తలపిస్తుంది.

దీంతో జీవనోపాధి కోసం ఆయా ప్రాంతాలకు వెళ్లిన వారు సొంతూళ్లకు తరలిపోతుంటారు. హైదరాబాద్ మహానగరం నుంచి లక్షలాది మంది ఉద్యోగులు కుటుంబ సమేతంగా గ్రామాలకు తరలిపోతుంటారు. దీంతో సంక్రాంతి పర్వదినం జరిగే ఆ నాలుగు రోజుల పాటు నగరమంతా ఖాళీఅవుతుంది.

ఊరెళ్లే వారి ఇండ్లపై నిఘా.. 

నగరంలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో సంక్రాంతికి దూర ప్రాంతాలకు వెళ్లే వారు తమ ఇంటి చిరునామా, ఫోన్ నంబర్ తదితర వివరాలను మీ పరిధిలోని పోలీస్ స్టేషన్ అధికారులకు వివరాలు అందించి, రిజిస్టర్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇలా సమాచారం ఇచ్చిన వారి ఇళ్లపై పోలీసులు నిఘా ఏర్పాటు చేయనున్నట్టు సైబరాబాద్ కమిషనరేట్ అధికారులు తెలిపారు.

పాటించాల్సిన జాగ్రత్తలు

* బీరువా తాళాలు ఇంట్లో ఉంచకుండా వెంట తీసుకెళ్లాలి. 

* ఇంట్లో ఏదో ఒక గదిలో లైట్ వేసి ఉంచాలి. 

* మీరు ఇంట్లో లేనప్పుడు చెత్తా చెదారం, న్యూస్ పేపర్, పాల ప్యాకెట్లు, జమ కానివ్వకుండా చూసుకోవాలి. 

* పని మనుషులు ఉంటే ప్రతిరోజూ వాకిలి ఊడ్వమని చెప్పాలి. 

* ఇంట్లో నగలు, నగదు ఉంటే బ్యాంక్ లాకర్లలో భద్రపర్చుకోవడం క్షేమం.

* ఎక్కువ రోజులు ఊరు వెళ్లేవారు   తమ విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లాలి. 

* ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాలను ఆన్‌లైన్ ద్వారా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి.

* ఇంటి డోర్‌కు సెంట్రల్ లాక్ సిస్టమ్ పెట్టుకోవాలి. 

* కాలనీ వాళ్లు కమిటీలు వేసుకుని    వాచ్‌మెన్‌లను, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి. 

* వీధుల్లో వచ్చే బీట్ కానిస్టేబుల్ నంబర్ దగ్గర ఉంచుకోవాలి. పోలీసులతో సమన్వయం చేసుకుంటూ వారికివారికి సహకరించాలి

అత్యవసరమైతే 100కు కాల్ చేయాలి

సైబరాబాద్ వాట్సాప్ నంబర్ 94906 17444 

హైదరాబాద్ వాట్సాప్ నంబర్ 94906 16555

రాచకొండ వాట్సాప్ నంబర్ 87126 62111