నేటి ఉదయం 11.30 వరకు పోలింగ్
యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ మంగళవారం ప్రారంభమైంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటల నుంచి వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల నిబంధనలను అనుసరించి ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.
బుధవారం ఉద యం 11.30 వరకు ఓటింగ్ జరగనుంది. పోలింగ్ పూర్తి కాగానే కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. బుధవారం సాయంత్రం వరకు ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశముంది. ఇప్పటికే కెనడా సరిహద్దులోని డిక్స్‌విల్లే కౌంటీలో తొలి ఫలితం వెల్లడైంది. ట్రంప్, కమలకు చెరో 3 ఓట్లు వచ్చాయి.
ఓటింగ్ సరళి పరిశీలిస్తే అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమల హ్యారిస్ మధ్య హోరాహోరీ పోరు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని సర్వేలు ట్రంప్ కంటే కమల స్వల్పంగా ముందంజలో ఉన్నట్లు పేర్కొన్నాయి. కాగా, 24.4 కోట్ల మంది ఓటర్లున్న అమెరికాలో ముందస్తు ఓటింగ్ ద్వారా ఇప్పటికే 8.1 కోట్ల మంది ఓట్లేశారు.
- అమెరికాలో మంగళవారం ప్రారంభమైన పోలింగ్
- పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు
- అభ్యర్థులు కమలహ్యారిస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య టఫ్ ఫైట్
- ఓటింగ్ ప్రక్రియ పూర్తి కాగానే కౌంటింగ్ మొదలు
- నేడు ఫలితాలు వెలువడే అవకాశం
వాషింగ్టన్, నవంబర్ 5: ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న అగ్రరాజ్య ఎన్నికలు ప్రారంభమయ్యాయి. భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 4.30 గంటల (అమెరికాలో ఉదయం 6 గంటలు)కు పోలింగ్ మొదలైంది. మొదటిగా న్యూహాంప్‌షైర్ రాష్ట్రంలో ఓటింగ్ ప్రారంభమైంది.
ఒక్కో రాష్ట్రంలో ఎన్నికల నియమావళి వేర్వేరుగా ఉండటం వల్ల పోలింగ్ సమయాల్లో మార్పులు ఉంటాయి. దీంతో అమెరికాలో ఉదయం 8 గంటల వరకు అన్ని రాష్ట్రాల్లో పోలింగ్ మొదలవుతుంది. అర్ధరాత్రి (భారత్‌లో బుధవారం ఉదయం 6.30 గంటలు) పోలింగ్ పూర్తవుతుంది. ఆ వెంటనే కౌంటింగ్ ప్రారంభిస్తారు.
బుధవారం సాయంత్రం లేదా గురువారం కల్లా ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశముంది. ఉదయం 3.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదలవుతాయి. కాగా, అమెరికాలో బ్యాలెట్ పద్ధతిలోనే ఓటింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో మొత్తం 24.4 మంది ఓటర్లు ఉండగా ముందస్తు పోలింగ్‌లో 8.1 కోట్ల మంది ఇప్పటికే ఓట్లు వేశారు.
ఫలితాలు ఎప్పుడంటే?
భారత్ తరహాలో అమెరికాలో జాతీయ ఎన్నికల సంఘం ఉండదు. అందువల్ల రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలే ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తాయి. అమెరికాలో ఆరు టైం జోన్లు ఉండటంతో వివిధ రాష్ట్రాల మధ్య సమయంలో తేడాలు ఉంటాయి. భారత్ కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం వరకు ఫలితాలపై ఓ స్పష్టత వస్తుందని తెలుస్తోంది.
ఇక స్వింగ్ స్టేట్లలో 93 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉండగా, ఇక్కడ అభ్యర్థుల మధ్య పోటీ బలంగా ఉంటుంది. ముఖ్యంగా పెన్సిల్వేనియా అధ్యక్ష అభ్యర్థిని నిర్ణయించే అవకాశముంది. అందువల్ల ఈ రాష్ట్రాల్లో తక్కువ మెజారిటీ వస్తే రీకౌంటింగ్ సైతం నిర్వహిస్తారు. దీంతో ప్రక్రియ మరింత ఆలస్యమవుతుంది.
అంతేకాకుండా న్యాయపరమైన చిక్కులు కూడా ఉండే అవకాశముంది. 2020లో నవంబర్ 3న ఎన్నికలు జరగగా 7వ తేదీన జో బైడెన్‌ను విజేతగా మీడియా వెల్లడించింది. కాగా, 2016లో ఎన్నికల రోజు రాత్రే ట్రంప్ గెలిచినట్లు ప్రకటన వచ్చింది.
ఇద్దరే కాదు
రెండోసారి అధ్యక్షుడిగా గెలవాలని రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలు కావాలని డెమోక్రాట్ అభ్యర్థి కమలహ్యారిస్ పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. ప్రధాన అభ్యర్థులు ట్రంప్, కమలే అయినా ఇతర పార్టీలకు చెందినవారు సైతం పోటీలో ఉన్నారు. లబర్టేరియన్ పార్టీ నుంచి ఛేస్ ఒలీవర్, గ్రీన్ పార్టీ నుంచి జిల్ స్టెయిన్, రాబర్ట్ జాన్ ఎఫ్ కెన్నెడీ జూనియర్ అధ్యక్ష బరిలో నిలిచారు. ప్రధాన అభ్యర్థుల మధ్య గట్టి పోటీ ఉండటంతో ట్రంప్, కమల అవకాశాలను వీరు దెబ్బతీసే అవకాశముంది.
ట్రంప్ కోసం 5 వేల మంది లాయర్లు
ఈ సారి ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో ట్రంప్ భారీ ఏర్పాట్లు చేసుకున్నారని తెలుస్తోంది. 2020 అధ్యక్ష ఎన్నికల్లో అవకతవ కలు జరిగాయని ట్రంప్ ఆరోపిస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించారు. అప్పుడు వాటికి సరైన ఆధారాలు లేవని ఆ పిటిషన్లను కోర్టులు తిరస్కరించాయి.
ఆనాటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ముందుగానే ట్రంప్ లాయర్లను నియమించుకున్నట్లు తెలుస్తోంది. పోలింగ్ ప్రక్రియ, ఓట్ల లెక్కింపు, అవకతవకలపై రిపోర్టును సిద్ధం చేయడంతో పాటు ఎన్నికలను వీరు నిశితంగా పరిశీలిస్తారు. మళ్లీ ఫలితాలు ట్రంప్‌కు ప్రతికూలంగా వస్తే ఆ ఆధారాలతో వెంటనే కోర్టును ఆశ్రయించేందుకు ఈ ఏర్పాట్లు ట్రంప్ చేసుకున్నట్లు సమాచారం.
17 రాష్ట్రాల్లో భారీ భద్రత
ఎన్నికల వేళ భద్రత కోసం కనీసం 17 రాష్ట్రాలు భారీగా బలగాలను సిద్ధంగా ఉంచాయి. ఈ రాష్ట్రాల్లో దాదాపు 600 నేషనల్ గార్డ్ బృందాలను మోహరించాయి. ఎలాంటి రాజకీయ హింస జరగకుండా ఒరెగాన్, వాషింగ్టన్, నెవాడా వంటి రాష్ట్రాలు ఈ మేరకు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాయి. ఎన్నికల వేళ వారం రోజుల పాటు 24 గంటలు పర్యవేక్షించేలా వాషింగ్టన్‌లో జాతీయ ఎన్నికల కమాండ్ పోస్ట్‌ను అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ ఏర్పాటు చేసింది. అమెరికాలోని లక్ష పోలింగ్ కేంద్రాలలో భద్రతను పెంచారు.
స్వింగ్ స్టేట్లలో రష్యా, ఇరాన్ కుట్రలు!
అధ్యక్ష ఎన్నికల్లో విదేశీ శక్తులు కుట్రలు చేస్తున్నాయని ఫెడరల్ ఏజెన్సీలు ఆరోపించాయి. ఈ ఎన్నికలను ప్రభావితం చేయడానికి రష్యా, ఇరాన్ ప్రయత్నించాయని చెబుతున్నాయి. ఓటర్లను ప్రభావితం చేసేందుకు నకిలీ సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని తెలిపాయి. ఇందుకోసం ఎన్నికల్లో కీలకమైన స్వింగ్ స్టేట్లను లక్ష్యంగా చేసుకున్నట్లు వివరించాయి.
ఈ మేరకు ఫెడరల్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎలక్షన్ సెక్యురిటీ ఏజెన్సీలు సంయుక్త ప్రకటన చేశాయి. ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు రేకేత్తించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇందుకోసం నకిలీ వీడియో లు, వెబ్‌సైట్లను సృష్టిస్తున్నారని వెల్లడించాయి. ఫలితంగా పోలింగ్ అధికారుల పైనా దాడులు జరిగే అవకాశముందని అంచనా వేశాయి.
మీ గళాన్ని వినిపించండి
ఎన్నికల రోజు వచ్చేసింది. ఈ రోజు మనం మన దేశాన్ని ప్రేమిస్తున్నాం. అమెరికా వాగ్దానాన్ని నమ్ముతాం. అందువల్ల మీ ఓటు హక్కును వినియోగించుకుని మీ గళాన్ని వినిపించండి.
కమలహ్యారిస్,
అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్ అభ్యర్థి
మళ్లీ అమెరికాను గొప్పగా మారుద్దాం
దేశ చరిత్రలో ముఖ్యమైన ఘట్టానికి చేరాం. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. అమెరికాను మళ్లీ గొప్పగా తీర్చిదిద్దుకుందాం. అమెరికా రాజకీయ చరిత్రలో విస్తృతమైన, అతిపెద్ద సంకీర్ణాన్ని నిర్మిద్దాం. కమల వస్తే పశ్చిమాసియా కుదేలవుతుంది. ఆమె మూడో ప్రపంచయు ద్ధాన్ని ప్రారంభిస్తారు. అందుకే ట్రంప్‌కే ఓటేయ్యండి. శాంతిని పునరుద్ధరించండి.
డొనాల్డ్ ట్రంప్,
రిపబ్లికన్ అభ్యర్థి
ట్రంప్ ఓటమి ఖాయం
ఈ ఎన్నికల్లో ట్రంప్‌ను కమలహ్యారిస్ ఓడిస్తుందని నాకు తెలుసు. అందుకు మీరంతా ఓటింగ్‌లో పాల్గొనాలి. ముందస్తు ఓటింగ్‌లో పాల్గొనని వారు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోండి.
బరాక్ ఒబామా,
అమెరికా మాజీ అధ్యక్షుడు
ఎవరూ గెలిచినా సత్సంబంధాలే
అమెరికా ఎన్నికల్లో ఎవరూ గెలిచినా.. ఫలితం ఎలా ఉన్నా రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడుతాయి. ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగుతాయి.ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇరుదేశాల స్నేహబంధం పురోగతి సాధిస్తుందని ఆశిస్తున్నా
జైశంకర్,
భారత విదేశాంగ మంత్రి