calender_icon.png 29 December, 2024 | 6:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లావెక్కుతున్నారా!

26-12-2024 12:00:00 AM

అస్తవ్యస్త జీవనశైలి, ఆహారపు అలవాట్లు, జన్యుపరమైన సమస్యలు.. కారణాలు ఏమైనా కావొచ్చు కానీ మనలో చాలామంది ఎదుర్కొంటున్న  సమస్య స్థూలకాయం. డయాబెటిస్, బీపీ, హార్ట్ ఎటాక్ కేసులు పెరగడానికి కారణం ఊబకాయమేనని డాక్టర్లు తేల్చి చెబుతున్నారు. అయితే పెరుగుతోన్న శరీరాన్ని ఎలాగైనా తగ్గించుకునేందుకు క్రాష్ డైట్ల్లు, వెయిట్ లాస్ మెషీన్లని ఆశ్రయిస్తున్నారు. అయితే అవేవీ సరైన ఫలితాన్నివ్వక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఉబకాయానికి చెక్ పెట్టాలంటే ఏం చేయాలో తెలుసా?

జన్యుపరమైన కారణాలతో బరువు పెరగడం, థైరాయిడ్ సమస్యతో బరువు పెరగడం, టెన్షన్లతో బరువు పెరగడం ఇవన్నీ ఒక రకం. ఎక్కువ ఆహారం, ఫ్యాటీ ఫుడ్ తినడం వల్ల బరువు పెరగడం అనేది మరో రకం. ఇండియాలో జంక్ ఫుడ్ తినడం వల్ల బరువు పెరుగుతున్నవారి సంఖ్య ఎక్కువవుతోంది. ఊబకాయంపై ది లాన్సెట్ జర్నల్ ఓ కథనాన్ని ప్రచురించింది.

దాని ప్రకారం ఇండియాలో 7 కోట్ల మంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. వీరిలో మహిళలు 4.4 కోట్ల మంది ఉండగా.. మగవారు 2.6 కోట్ల మంది ఉన్నారు. అయితే సాధారణంగా యువతకు బాడీలో కొవ్వు ఉండదు. ఎందుకంటే వారు నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. మధ్య వయస్సు వచ్చాక.. శరీరం ఎక్కువగా విశ్రాంతి కోరుకుంటుంది. దాంతో పని తగ్గిస్తారు. అందువల్ల మధ్య వయస్సువారు బరువు పెరగడం జరుగుతుంటుంది.

శరీరంలో ఉండాల్సిన దాని కంటే ఎక్కువ కొవ్వు ఉంటే, అదే ఊబకాయం అవుతుంది. పొట్ట, నడుం, కాళ్లు, సీటు ఇలా కొన్ని భాగాల్లో కొవ్వు విపరీతంగా పేరుకుపోతుంది. అది అంత ఈజీగా కరగదు. దాన్ని కరిగించకపోతే రోజురోజుకూ మరింత కొవ్వు పెరుగుతూ.. బరువు పెరిగిపోతుంటారు.

ఎందుకంత బరువు

ఊబకాయం సమస్యతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుందే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. అనారోగ్యకరమైన ఆహార పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్ల వాడకం పెరగడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. అలాగే పిల్లలకి అడిగిందల్లా కొనిచ్చే సంస్కృతి పెరగడం, ఆహారవేళలు పాటించకపోవడం వంటివీ తోడయ్యాయి. దాంతో పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ లావైపోతున్నారు.

జీవనశైలిలో వేగం ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది. అరకిలోమీటర్ దూరానికి కూడా బైక్ లేదా కారెక్కాల్సిందే. దాంతో నడవడం, సైకిల్ తొక్కడం దాదాపు మర్చిపోయారు. ఇవన్నీ సరిపోవన్నట్లు ఇంటర్నెట్ పుణ్యమా అని ప్రపంచ వంటకాలన్నింటినీ రుచి చూడటం ఓ హాబీగా మారింది. దాంతో తిండికి తగ్గ వ్యాయామం ఉండటం లేదు.

పిల్లలకు చదువుల పోటీలు, పెద్దవాళ్లకు వృత్తి సవాళ్లతో ఒత్తిడి, ఆందోళనలు అధికమై శరీరంలోని హార్మోన్ల వ్యవస్థ దెబ్బతింటోంది. ఫలితంగా ఊబకాయం పెరుగుతోంది. దీనికి తోడుగా హృద్రోగాలు, మధుమేహం వంటి వ్యాధులు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా జన్యువుల కారణంగా భారతీయుల్లో అధికశాతం మందిలో పొట్ట చుట్టూ కొవ్వు పేరు కుంటుంది.

దానివల్ల హృద్రోగ సమస్యలు అధికమైనట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఊబకాయం వల్ల ఆయుఃప్రమాణం తగ్గి పోతుందని అధ్యయనాలూ చెబుతున్నాయి. కరోనా సోకిన వాళ్లలోనూ ఊబకాయులకి చికిత్స చేయడం కష్టంగా మారుతోంది. మొత్తమ్మీద ఊబకాయం రావడానికి సవాలక్ష కారణాలు ఉన్నట్లే, అది తెచ్చిపెట్టే సమస్యలు కూడా ఎక్కువే. అందుకే బరువు పెరుగుతున్న సమయంలోనే చికిత్స తీసుకుంటే ఫలితం ఉంటుంది అంటున్నారు డాక్టర్లు. 

తినకుండానే.. 

అధిక బరువు అనగానే వెంటనే గుర్తొచ్చేది అనారోగ్యకరమైన ఆహారం, వారి జీవనశైలి. కానీ ఆరోగ్యవంతమైన జీవనశైలి ఉన్నా అధికంగా బరువు పెరుగుతారని తెలుస్తోంది. పర్యావరణంలోని కొన్ని రసాయన సమ్మేళనాలు మనిషిలో అధిక బరువు లేదా ఊబకాయం వృద్ధికి దోహదం చేస్తాయని తేలింది. ఈ రసాయన సమ్మేళనాలను ఒబెసోజెన్స్ అంటారు.

అజీర్ణం లేదా కలుషితమైన గాలిని పీల్చడం ద్వారా వీటి ప్రభావానికి లోనై శరీరంలో తెల్ల కొవ్వు కణజాలం పెరుగుతుంది. దీంతో బరువు పెరుగుతూనే ఉంటాం. షాకింగ్ విషయం ఏంటంటే.. మనం రోజూ వాడే డిటర్జెంట్లు, ఆహార పదార్థాలు, ప్లాస్టిక్ డబ్బాలు, బట్టలు, కాస్మోటిక్స్ ఇలా అన్నింటిలో ఈ కెమికల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా శరీర బరువును పెంచుతున్నాయి. 

అనేక రోగాలు

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అధిక బరువు డయాబెటిస్‌కు కారణమవుతుందని చెబుతున్నారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు టైప్-2 మధుమేహం వస్తుంది. అధిక రక్త చక్కెర కాలక్రమేణా పెరుగుతుంది. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్, మూత్రపిండాల వ్యాధి, కంటి సమస్యలు, నరాల రుగ్మతలను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఊబకాయం వల్ల కాలేయ ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుంది. అధిక బరువు కొవ్వు కాలేయ ప్రమాదాన్ని పెంచుతుంది. అలాంటి పరిస్థితిలో, కాలేయంలో కొవ్వు పెరుగుతుంది, ఇది కాలేయం దెబ్బతినడానికి, కాలేయ సిర్రోసిస్, కాలేయ వైఫల్యానికి కూడా దారితీస్తుంది. ఊబకాయం ద్వారా రక్తపోటు సమస్య పెరుగుతుందని తెలిసిందే. ఈ రక్తపోటు గుండె సంబంధిత సమస్యలకు కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పరిష్కారమార్గాలు..

రోజు గంటపాటు నడవటం, ఏరోబిక్స్, యోగా లాంటివి చేయటం వల్ల శరీర బరువు అదుపులో ఉంచువచ్చు. ఒత్తిడిని అదుపులో ఉంచడం ద్వారా కూడా ఊబకాయాన్ని నివారించవచ్చు. ప్రాణాయామం ద్వారా ఒత్తిడి తగ్గించొచ్చు. మెడిటేషన్, మనసుని ఉల్లాసపరిచే ఏ పనినైన చేయటం ద్వారా ఒత్తిడిని నియంత్రించవచ్చు. ఆలాగే సర్జరీల ద్వారా కూడా అధికంగా ఉన్న కొవ్వుని తొలగిస్తారు. దీని వల్ల కూడా చాలా సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి చక్కటి ఆహరం, ఒత్తిడి లేని జీవన విధానం, ఒంటిని చురుకుగా ఉంచడం, వ్యాయామం మొదలైనవాటిని పాటించడం ద్వారా ఊబకాయం పెరగకుండా జాగ్రత్త వహించవచ్చు.

ఇవి తీసుకుందాం

గుడ్లు: గుడ్లలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. వాటి ద్వారా శరీరానికి విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. బరువు తగ్గాలనుకునేవారు గుడ్లను బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే త్వరగా ఆకలి వేయదు. తద్వారా బరువు పెరుగకుండా కాపాడుకోవచ్చని ఓ పరిశోధనలో తేలింది. ఊబకాయులు రోజూ కనీసం మూడు గుడ్లను అల్పాహారంగా తీసుకోవడంవల్ల వారి శరీర కొవ్వులో 16 శాతం వరకు తగ్గుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

గ్రీన్ టీ: అధిక బరువు సమస్యతో బాధపడేవారికి గ్రీన్ టీ మంచి పరిష్కారం చూపుతుంది. గ్రీన్ టీలో శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. 

ఆలివ్ ఆయిల్: ఆలివ్ ఆయిల్ శరీరంలో పోగుపడ్డ ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తుంది. అదేవిధంగా శరీరానికి అవసరమైన కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. అలాగే ఆలివ్ నూనె జీవక్రియ రేటును పెంచుతుంది. ఆలివ్ నూనెతో వంటలు చేసుకోవచ్చు. లేదా సలాడ్లపై కొన్ని చుక్కలు వేసుకొని తీసుకోవచ్చు.

వీటికి దూరంగా ఉందాం

  1. కేకులు
  2. కొవ్వు ఎక్కువగా ఉన్న స్వీట్లు
  3. పాల పదార్థాలు
  4. మాంసాహారం
  5. బయట తినే ఫాస్ట్ ఫుడ్స్
  6. పిండితో చేసిన పదార్థాలు
  7. చాక్లెట్లు
  8. శీతల పానీయాలు
  9. చక్కెర ఎక్కువగా ఉన్న పదార్థాలు
  10. వేయించిన కూరలు