- భక్తుల రద్దీని గమనించలేదా? బాధ్యతలు నిర్వర్తించలేరా ?
- టీటీడీ అధికారులపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం
- తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాల పరిశీలన
- డీఎస్పీ, గోశాల డైరెక్టర్ సస్పెన్షన్ మరో ముగ్గురి బదిలీ
- మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం
- కుటుంబ సభ్యుల్లో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం
తిరుపతి, జనవరి 9: ‘భక్తుల రద్దీని గమనించలేదా? రద్దీ పెరుగుతుంటే ఏం చర్యలు తీసుకున్నారు ? బాధ్యతల సక్రమంగా నిర్వర్తించకుండా తమాషా చేస్తున్నా రా?’ అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో బుధవారం సంభవించి ఆరుగురు మృతిచెందగా, పలువురు గాయపడిన సం గతి విదితమే. ఘటనా స్థలాలను గురువారం సీఎం పరిశీలించారు.
ఘటన సంభవించడానికి గల కారణాలపై టీటీడీ ఈవో శ్యామలరావు, తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్లును ఆరా తీశారు. ‘భక్తుల రద్దీని చూసి టిక్కెట్లు ఇవ్వాలని తెలియదా? భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాక ఎలాంటి చర్యలు తీసుకున్నారు? బాధ్యతాయుతంగా నిర్ణ యం తీసుకోవాలి కదా ?’ అని టీటీడీ జేఈవో గౌతిమిని ప్రశ్నించారు. అనంతరం టీటీటీ అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహిం చారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందారని తెలిసి ఎంతో బాధపడ్డా. ఇకపై ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండాలని ఓ భక్తుడిగా కోరు కుంటున్నా. ఇక నుంచైనా తిరుపతి పవిత్రతను కాపాడే బాధ్యత తీసుకుంటా’ అని తెలిపారు. తొక్కిసలాట జరిగిన ప్రాంతాలను పరిశీలించిన తర్వాత సీఎం చంద్రబాబునాయుడు తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 35 మంది క్షతగాత్రులను పరామర్శిం చి.. వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం మెరుగైన వైద్యం అందిస్తుందని భరోసానిచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘తప్పు జరిగింది. బాధ్యత తీసుకుంటాం. ఘటనపై ప్రభుత్వం తరఫున క్షమాపణలు చెప్తున్నామ’న్నారు. అనంతరం అధికారులు ఆరు మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేలా ఏర్పాట్లు చేశారు. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.
డీఎస్పీదే తప్పు: కలెక్టర్
తిరుపతి కలెక్టర్ తొక్కిసలాట, భక్తుల మృతిపై సీఎం చంద్రబాబునాయుడికి నివేదిక సమర్పించారు. ‘డీఎస్పీ రమణకుమార్ అత్యుత్సాహం ప్రదర్శించారు. తొక్కిసలాట జరిగినా ఆయన సరిగా స్పందించలేదు. ఎస్పీ స్పందించి సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వచ్చి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. టికెట్ కౌంటర్ బయట అంబులెన్స్ పార్క్ చేసి ఉన్నప్పటికీ ఘటన తర్వాత 20 నిమిషాల వరకు డ్రైవర్ అందుబాటులో లేడు.
డీఎస్పీతో పాటు అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే భక్తులు చనిపోయారు’ అని కలెక్టర్ నివేదికలో పేర్కొన్నారు. మరోవైపు తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో అంబులెన్స్‌లు అందుబాటులో లేవని, తొక్కిసలాట జరిగిన 20 నిమిషాల తర్వాత అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి వచ్చాయని ప్రత్యక్ష సాక్షులు వెల్లడిస్తున్నారు.
ఇద్దరు అధికారులపై వేటు.. ముగ్గురి బదిలీ..
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన తిరుపతి డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు సీఎం చంద్ర బాబు నాయుడు ప్రకటించారు. అలాగే తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ జేఈవో గౌతమి, సీఎస్వో శ్రీధర్‌ను బదిలిచేస్తున్నామని స్పష్టంచేశారు. తొక్కిసలాట ఘటనపై సమగ్ర విచారణ చేపడతామని వెల్లడించారు.
మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం
తొక్కిసలాట ఘటన మృతులకు టుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ఏపీ ప్రభు త్వం ప్రకటించింది. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగం ఇస్తామని పేర్కొన్నది. అలాగే తీవ్రంగా గాయపడిన మహిళలు తిమ్మ క్క, ఈశ్వరమ్మకు రూ.5 లక్షల చొప్పు న, మిగతా 33 మంది క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని తెలిపింది. క్షతగాత్రులకు ఇప్పటికీ వైకుంఠ ద్వారం ద్వారా శ్రీ వారి దర్శనం చేసుకోవాలనే కోరిక బలంగా ఉందని, వారందరికీ శుక్రవారం శ్రీవారి దర్శన భాగ్యం కల్పి స్తామని స్పష్టం చేసింది.