29-04-2025 12:27:12 AM
సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
వేసవి సెలవుల దృష్ట్యా స్కూల్స్, కళాశాలలకు సెలవులు రావడంతో చాలా వరకు తమ సొంత గ్రామాలకు కానీ, ఇతర ప్రాంతాలకు గాని ప్రయాణాలు చేస్తుంటారు. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారని, ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇంట్లో బంగారు నగలు, నగదు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలన్నారు. వేరే ఊరు వెళ్తున్నప్పుడు పక్కింటి వారికి పరిశీలించాలని కోరాలని, తమ వాహనాలను రోడ్లపై కాకుండా ఇంటి ఆవరణలో పార్కింగ్ చేయాలన్నారు. విలువైన వస్తువుల సమాచారాన్ని, వ్యక్తిగత ఆర్థిక విషయాలను ఇతరులకు చెప్పకూడదని, ఇంటికి సెంట్రల్ లాకింగ్ సిస్టం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం మంచిదన్నారు.
సీసీ కెమెరాలను ఇంటర్నెట్ కు అనుసంధానం చేస్తే మొబైల్ నుంచే మీ ఇంటిని ఎక్కడి నుంచి అయినా ప్రత్యక్షంగా చూసుకునే వీలుంటుందన్నారు. ప్రజలు తమ ప్రాంతంలో గస్తీ ఏర్పాటుకు సహకరించాలని, తమ ప్రాంతం పరిధిలోని పోలీస్ స్టేషన్ అధికారి ఫోన్ నెంబర్ ఇతర అధికారుల నెంబర్లు ప్రజలు తమ సెల్ ఫోన్ లలో ఉంచుకోవాలన్నారు. సుదూర ప్రాంతాల ప్రయాణాలకు వెళ్తున్నట్లైతే, సమీప పోలీసు స్టేషన్లలో మీ ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్లాలని, తద్వారా ఎలాంటి విపత్కర పరిస్థితులలోనైనా గుర్తించడానికి వీలుగా ఉంటుందని ఎస్పీ పంకజ్ తెలిపారు.