calender_icon.png 3 October, 2024 | 12:00 PM

దసరాకు ఊరెళ్తున్నారా..? తస్మాత్ జాగ్రత్త!

02-10-2024 02:25:03 AM

ఈ సూచనలు పాటించండి

చోరులకు పని చెప్పకండి

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 1 (విజయక్రాంతి): దసరా సెలవులకు ఊరెళ్తు న్నారా? అయితే.. తస్మాత్ జాగ్రత్త.. అని హెచ్చరిస్తున్నారు పోలీసులు. బుధవారం నుంచి విద్యాసంస్థలకు రాష్ట్రప్రభుత్వం సెలవులు ప్రకటించిన నేపథ్యంలో మహానగరం నుంచి వేలాది కుటుంబాలు పండుగకు సొంత ఊళ్లకు వెళ్తాయి.

ఇండ్లకు తాళం వేసి హ్యాపీగా ఊరెళ్తాం.. సరే.. మరి ఇంటికి రక్షణ ఎవరు? అందుకు పోలీస్‌శాఖ ఒక చక్కటి ప్లాన్ ఆలోచించింది. దీనిలో భాగంగానే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ సీపీలు కొన్ని కీలకమైన సూచనలు జారీ చేశారు. అవేంటో చూద్దాం..

ఇవి పాటించండి..

  1. దసరాకు ఊరు వెళ్లాల్సి వస్తే విలువైన బంగారు, వెండి ఆభరణాలను లాకర్లలో భద్రపరచండి.
  2. ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉన్న తాళాన్ని వాడండి. సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సార్ వాడితే మరీ మంచిది. 
  3. ఇంట్లో విలువైన వస్తువులు ఉంటే మీరు ఊరెళ్తున్నారని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో చెప్పి ఉంచండి. 
  4. ఇంటి ఆవరణలో సీసీ కెమెరాలను అమర్చుకుంటే అన్ని విధాలా మేలే. అమర్చడమే కాకుండా తరచూ ఫుటేజీని పరిశీలించండి.
  5. వాహనాలను ఇంటి ఆవరణలోనే పార్క్ చేయండి. రోడ్డు పక్కన పార్క్ చేయాల్సి వస్తే పెట్రోల్ లాక్, చక్రాలకు చైన్ లాక్ వేయండి. 
  6. నమ్మకమైన వ్యక్తులను మాత్రమే సెక్యూరిటీ గార్డులుగా నియమించుకోండి. వారి చిరునామాతో పాటు పూర్తి వివరాలు తెలుసుకోండి.
  7. ఇంటి ముందు న్యూస్ పేపర్, పాలప్యాకెట్లు జమ కానీయకుండా చూడండి. దొంగలు వాటిని గమనించి కూడా చోరీలకు పాల్పడే అవకాశం ఉంది. 
  8. డోర్‌కు తాళం వేసినప్పటికీ అది కనిపించకుండా డోర్ కర్టెన్స్‌తో కవర్ చేయండి. 
  9. మీరు ఇంట్లో లేనప్పుడు కూడా లైట్లను వేసి ఉంచితే మంచిది. 
  10. మీరు ఊరు వెళ్లే విషయాన్ని నమ్మకమైన ఇరుగు పొరుగు వారికి చెప్పండి. అప్పుడప్పుడు మీ ఇంటిని గమనించమని చెప్పండి. 
  11. అల్మరా, కప్‌బోర్డ్స్‌కు సంబంధించిన తాళాలు కామన్ ఏరియా అయిన చెప్పుల స్టాండ్, పరుపులు, దిండ్ల కింద, డ్రెస్సింగ్ టేబుల్ వంటి రెగ్యులర్ ప్రదేశాల్లో కాకుండా రహస్య ప్రదేశాల్లో దాచిపెట్టండి. 
  12. సోషల్ మీడియాలో మీరు బయటకు వెళ్తున్న విషయాన్ని షేర్ చేయకపోవడమే మంచిది. 
  13. దొంగతనాలను నివారించేందుకు కాలనీల్లో స్వచ్ఛందంగా కమిటీలు ఏర్పాటు చేసుకుంటే మేలు.
  14. మీ కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100కి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించండి. 

స్థానిక పోలీస్ స్టేషన్‌లో తెలపండి

దసరా సెలవులకు సొంతూళ్లకి వెళ్లేవారు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో చెప్పి వెళ్లండి. అలా చేస్తే మీరుండే ప్రాంతంలో పోలీస్ పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తాం. నిరంతరం గస్తీ నిర్వహిస్తాం. పెద్ద మొత్తంలో డబ్బు, బంగారు ఆభరణాలు ఇంట్లో ఉంచకండి. బ్యాంకు లాకర్‌లో పెట్టి ఊరికి వెళ్లండి. ఇంటి బయట సీసీ కెమెరాలు అమర్చకుంటే మరింత మేలు.

 సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి