calender_icon.png 9 October, 2024 | 7:53 AM

ఈ పండక్కి బంగారం కొంటున్నారా!

06-10-2024 12:00:00 AM

  1. ఆభరణాలు ఒక్కటే ఆప్షన్ కాదు 
  2. ఇతర సాధనాలూ ఉన్నాయ్

పండుగలు, శుభదినాల సందర్భంగా విలువైన వస్తువుల్ని, బంగారాన్ని కొనడం దశాబ్దాల నుంచి ఒక ఆచారంగా కొనసాగుతున్నది. అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని పలువురు విశ్వసిస్తుంటారు. ప్రస్తుతం ఎంతోమంది మదుపు చేయడానికి సైతం బంగారాన్ని కొంటున్నారు.

సాధారణంగా బంగారం కొనడమంటే ఆభరణాల దుకాణాలకు దారితీస్తుంటారు. ధరించడానికే ఆభరణాలు. పుత్తడిలో మదుపుచేసేందుకు పలు ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఆ సాధనాలు ఇవే..

సావరిన్ గోల్డ్ బాండ్స్ 

సావరిన్ గోల్డ్ బాండ్లను (ఎస్‌జీబీలు) కేంద్ర ప్రభుత్వం జారీచేస్తుంది. అయితే వాటిని ఏడాదికి ఒకటి, రెండు దఫాలు మాత్రమే ఒక వారం రోజులపాటు రిజర్వ్‌బ్యాంక్ అందుబాటులో ఉంచుతుంది. ఈ ఏడాది కొత్త బాండ్ ఇష్యూల జారీని ఇంకా ప్రభుత్వం ప్రకటించలేదు. కానీ ఎస్‌జీబీలను సెకండరీ మార్కెట్లో కొనుగోలు చేసే అవకాశం ఉన్నది.  కొద్ది ఏండ్లుగా జారీఅయిన ఎస్‌జీబీలు స్టాక్ ఎక్సేంజీల్లో ట్రేడవుతున్నాయి. అందుల్లో చురుగ్గా ట్రేడయ్యే (అధిక లావాదేవీలు జరిగే) ఎస్‌జీబీని పెట్టుబడి కోసం కొనవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 

డిజిటల్ గోల్డ్

బంగారంలో పెట్టుబడి కోసం ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం ద్వారా ‘డిజిటల్ గోల్డ్’గా వ్యవహరించే గోల్డ్ యూనిట్లను కొనవచ్చు. పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తదితర పేమెంట్ యాప్స్ ద్వారా డిజిటల్ గోల్డ్‌ను మదుపు కోసం కొనవచ్చు. ఖాతాదారులకు డిజిటల్ గోల్డ్ పెట్టుబడి అవకాశాన్ని కల్పించేందుకు పేమెంట్ యాప్స్ సేఫ్‌గోల్డ్ లేదా ఎంఎంటీసీపీఏఎంపీ (ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎంటీసీ, సిట్జర్లాండ్‌కు చెందిన పీఏఎంపీ మధ్య జాయింట్ వెంచర్)లతో భాగస్వామ్యం కుదర్చుకున్నాయి.  

గోల్డ్ కాయిన్స్

జ్యువెలర్లు, బ్యాంక్‌లు, నాన్ ఫైనాన్స్ కంపెనీలు గోల్డ్ కాయిన్స్‌ను విక్రయిస్తాయి. ఈడూ వెబ్‌సైట్స్‌లో కూడా గోల్డ్ కాయిన్స్ లభిస్తాయి. ప్రతీ బంగారు నాణెం బీఐఎస్ మార్గదర్శకాలకు అనుగుణంగా హాల్‌మార్క్ చేయబడి ఉంటుంది. టాంపర్‌ప్రూఫ్ ప్యాకేజింగ్‌లో ఉన్న గోల్డ్ కాయిన్స్ మాత్రమే కొనాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. 0.5 గ్రాముల నుంచి 50 గ్రాముల వరకూ బరువుగల గోల్డ్ కాయిన్స్ మార్కెట్లో లభ్యమవుతున్నాయి.

గోల్డ్ సేవింగ్స్ ప్లాన్

బంగారంలో మదుపు చేసేందు కు వీలుగా పలు జ్యువెలరీ సంస్థలు కొద్ది ఏండ్లుగా గోల్డ్ సేవింగ్స్ స్కీమ్‌లను ప్రవేశపెట్టాయి. బంగారం పొదుపు పథకాల్లో మీరు ఎంచుకున్న నిర్దేశిత కాలపరిమితి వరకూ ప్రతీ నెలా కొంత స్థిర మొత్తాన్ని డిపాజిట్ చేయవచ్చు. నిర్ణీతకాలం ముగిసిన తర్వాత మీరు అప్పటివరకూ డిపాజిట్ చేసిన మొత్తం, దానికి లభించే బోనస్‌తో కలిపి, అంత విలువైన బంగారం లేదా ఆభరణాన్ని కొనవచ్చు. 

బంగారు ఆభరణాలు

పండుగలు, పెండ్లిళ్లు, ఇతర శుభదినాల్లో ధరించదలిస్తేనే బంగారం ఆభర ణాలు కొనుగోలు చేయాలని, బంగారం లో పెట్టుబడి చేయడానికి, దాచుకోవడానికైతే ఇతర మార్గాల్ని ఎంచుకోవాలని పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఆభరణాల్ని సుర క్షితంగా భద్రపర్చుకోవడం కష్టమైనది, ఖర్చుతో (లాకర్ చార్జీలు) కూడుకున్నది. పైగా కాలం గడిచిన తర్వాత ఆభరణాల మోడల్స్, స్టుల్స్ పాతపడిపోతాయి. జ్యువెలరీకి మజూరీ చార్జీలు, తరుగు వంటి అదనపు వ్యయాలు ఉంటాయి. 

గోల్డ్ ఈటీఎఫ్‌లు

మ్యూచువల్ ఫండ్ సంస్థలు జారీచేసే గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో మదుపుచేసినా, బంగారాన్ని కొని దాచుకున్నట్లే. గోల్డ్ ఈటీఎఫ్‌లు (ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్)  ద్వారా ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన నిధుల్ని మ్యూచువల్ ఫండ్ 99.5 శాతం స్వచ్ఛత కలిగిన స్టాండర్డ్ బంగారంలో పెట్టుబడి చేస్తాయి.

గోల్డ్ ఈటీఎఫ్ యూనిట్ ధరను ఒక గ్రాము బంగారం మార్కెట్ ధరకు అనుగుణంగా నిర్ణయిస్తాయి. ఆ ఈటీఎఫ్‌ను ఖాతాదారులు అవసరమైనపుడు ఆయా మ్యూచువల్ ఫండ్‌కు సమర్పిస్తే అప్పటి పుత్తడి ధర ప్రకారం మీకు నగదు అందుతుంది. వాటిని స్టాక్ ఎక్సేంజీల్లో సైతం ట్రేడింగ్ రోజుల్లో కొనవచ్చు. విక్రయించవచ్చు.