calender_icon.png 23 February, 2025 | 2:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిటైర్మెంట్ తర్వాత.. ఇల్లు కొంటున్నారా?

23-02-2025 12:35:35 AM

చాలామంది ఉద్యోగంలో ఉన్నప్పుడు.. ఉద్యోగ బాధ్యతలరీత్యా వేరు వేరు ప్రాంతాల్లో తిరగాల్సి వస్తుంది. కాబట్టి రిటైర్ అయిన తర్వాత సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకుంటారు. రిటైర్మెంట్ తర్వాత తమకు నచ్చిన ప్రాంతంలో స్థిరపడాలనుకుంటారు. అయితే సొంతింటిని కట్టుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. 

రిటైర్ అయ్యే సమయానికి దాదాపుగా పిల్లలు వారి జీవితాల్లో సెటిల్ అవుతారు. కాబట్టి మీరు జీవిత భాగస్వామితో కలిసి గానీ.. ఒంటరిగా గానీ జీవించాల్సి రావచ్చు. అందువల్ల అన్ని విధాలుగా సరిపోయే నివాస ప్రాంతం ఎంచుకోవడం ముఖ్యం. మీకు సమీపంలోనే అన్ని రకాల వస్తువులు లభ్యమయ్యే మార్కెట్, హాస్పిటల్స్, వినోద కేంద్రాలు, వేరు వేరు ప్రాంతాలకు రవాణా సౌకర్యం వంటివి ఉండేలా చూసుకోవాలి. 

చిన్న ఇల్లునా..

పదవీ విరమణ తర్వాత భార్యభర్తలు నివసిస్తారు కాబట్టి చిన్న ఇల్లునా సరిపోతుంది. దీనివల్ల రెండు ప్రయోజనాలు ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ ఇంటి పనులు చేయడం కష్టం. చిన్న ఇల్లు అయితే నిర్వహణ సులభంగా ఉంటుంది. 

సహాయం కోసం.. 

మీ కుటుంబ సభ్యులు మీకు దగ్గరలో లేనప్పుడు, కచ్చితంగా బయటి నుంచి సహాయం అవసరం అవుతుంది. ఒకవేళ ఏదైనా సహాయం కావాల్సి వచ్చినప్పుడు అందుతుందా.. లేదా.. నిర్ధారించుకోవాలి. మీకు దగ్గరలో తెలిసినవారో, స్నేహితులో ఉండేలా చూసుకోవాలి. అవసరమైతే రోజువారీ పనుల కోసం సహాయకులను నియమించుకోవడం మంచిది.

సామాజిక సంబంధాలు

పదవీ విరమణ తర్వాత చాలామంది ఒంటరితనాన్ని అనుభవించవచ్చు. కాబట్టి మంచి వాతావరణంలో ఉండటం ముఖ్యం. ఇరుగు పొరుగు వారు స్నేహపూర్వకంగా ఉన్నారా? చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉంది? అన్నవి చెక్ చేసుకోవాలి. పదవీ విరమణ తర్వాత ఎక్కువ ఖాళీ సమయం ఉంటుంది. కాబట్టి బుక్ క్లబ్లు, లైబ్రరీలు, సమావేశ మందిరాలు, పార్కులు, స్నేహపూర్వక సంబంధాల వంటివి శారీరక, మానసిక ఉత్తేజాన్ని అందించడంలో సహాయపడతాయి.