09-04-2025 01:00:32 AM
నాగర్ కర్నూల్ ఏప్రిల్ 8 (విజయక్రాంతి) కరువు నేలగా పేరొందిన పాలమూరు ప్రాంతానికి కృష్ణానీటినందించాలనే లక్ష్యంతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డిజైన్ చేయగా గత ప్రభుత్వం ఏదుల నుండి డిండి, నల్గొండ ప్రాంతానికి సొరంగ మార్గం ద్వారా నీటిని తరలించాలని చేసిన కుట్రలకు ఉద్యమిస్తూ నాడు సంతకాలు చేసిన నేతలే నేడు మంత్రివర్గంలో ఉన్నారని మరి ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ధ్వజమెత్తారు.
మంగళవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాలమూరు ప్రాంతాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. నాడు డిండి తరలింపును అడ్డుకున్న వాళ్ళు నేడు చచ్చిపోయారా అంటూ ప్రస్తుత ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును ఉద్దేశించి కామెంట్ చేశారు. నల్గొండ ప్రాంత రిటైర్డ్ ఇంజనీర్లు, ఆ శాఖ మంత్రులే రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన చేతబెట్టారని వారి చేతిలోనే ప్రభుత్వం నడుస్తోందని ఆయన ఆరోపించారు.
పాలమూరు ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వం కోల్పోయిన ఈ ప్రాంత వాసులకు నీరు దక్కకుండా ఏదుల రిజర్వాయర్ నుండి నిత్యం ఒక టీఎంసీ చొప్పున18వందల కోట్ల ఖర్చుతో సొరంగ మార్గం ద్వారా డిండి నల్గొండ ప్రాంతాలకు నీటిని తరలించుకుపోవాలనుకోవడం దుర్మార్గమన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం అయితే సుమారు పది మీటర్ల వ్యాసార్థం టర్నల్ నిర్మాణంతో మళ్లీ ఈ ప్రాంత వాసులు భూములు, ఇళ్ళు కోల్పోయే ఆస్కారం ఉందన్నారు.
ప్రస్తుతం ప్రజల చేత ఎన్నుకోబడిన పాలమూరు ప్రాంత ఎమ్మెల్యేలు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. పాలమూరు ప్రాంతం పూర్తిగా నష్టపోతున్నా నల్లమల ముద్దుబిడ్డ, పాలమూరు బిడ్డగా చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
డిండి ప్రాంతానికి నీరు తరలించాలని ఉద్దేశమే ఉంటే వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్ నుండి దుందుభి నది మీదుగా డిండి ప్రాంతానికి పైసా ఖర్చు లేకుండా నీటిని తరలించకపోయే అవకాశం ఉందన్నారు. లేదంటే మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన జీవ ప్రకారం శ్రీశైలం డ్యాం నుండి లిఫ్ట్ ద్వారా తీసుకువెళ్లాలని సూచన చేశారు.
ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్లో ఎవరికి నీటిపారుదల శాఖ పట్ల అవగాహన లేదన్నారు కేవలం ఒక నల్గొండ ప్రాంతానికి చెందిన రిటైర్డ్ ఇంజనీర్ కన్సర్నలోనే ఈ డిండి ప్రాజెక్టు రూపకల్పన జరిగిందని దానిపై సమగ్ర విచారణ జరపాలన్నారు.
ఎట్టి పరిస్థితుల్లో ఏదుల నుండి డిండి ప్రాంతానికి నీటిని తరలించే ప్రసక్తే లేదని ప్రజలను చైతన్యవంతం చేసి ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వారి వెంట నేతలు అర్థం రవి, బాల గౌడ్, ఐతోల్ లక్ష్మయ్య, భీముడు, శంకర్ తదితరులు ఉన్నారు.