calender_icon.png 31 October, 2024 | 6:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలాంటి హీరోయిన్లు ఉన్నారా?

28-06-2024 12:05:00 AM

హర్యానాకు చెందిన పరిణీతి చోప్రా, పంజాబీ గాయకుడైన ‘అమర్ సింగ్ చంకీల’ జీవితం ఆధారంగా అదే పేరుతో దర్శకుడు ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన సినిమాలో కథానాయికగా నటించిన విషయం తెలిసిందే. స్వతహాగా గాయకురాలైన ఆమె, ఈ సినిమా కోసం ఓ పాట కూడా పాడారు. ఈ విషయం అలా ఉంచితే.. ఇటీవల తోటి హీరోయిన్లకు ఓ బాణం లాంటి ప్రశ్న వేసింది పరిణీతి. ఈ సినిమా అనుభవాలను ఓ మీడియా సంస్థతో పంచుకున్న ఆమె “అమర్ సింగ్ చంకీల’ సినిమా కోసం నేను 16 కిలోల బరువు పెరిగాను. నేటి తరం హీరోయిన్లలో ఈ సాహసం చేసే వాళ్లు ఎవరైనా ఉన్నారా?” అని నిలదీసింది. కొనసాగింపుగా తన సినీ ప్రయాణం గురించి చెబుతూ ‘కెరీర్ ప్రారంభించిన తొలి రోజుల్లో ఎలాంటి కథలు ఎంపిక చేసుకోవాలో తెలియలేదు.

ఇప్పుడు ప్రేక్షకులు కొత్త తరహా పాత్రల్ని కోరుకుంటున్నారు. దానికి తగ్గట్టు నేను సవాలు విసిరే పాత్రలనే చేయాలని నిర్ణయించుకున్నాను’ అని చెప్పుకొచ్చిందామె. ఏ మాటకామాటే చెప్పుకోవాలి.. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకునే చాలా మంది కథానాయికలు శరీరంలో కొలతలు, పారితోషికాల లెక్కలకే ప్రాధాన్యమిస్తూ పాత్రకు అనుగుణంగా మారేందుకు అంతగా సుముఖత చూపరు. అనుష్క శెట్టిలా కొందరు వీటికి అతీతంగానూ ఉన్నారనుకోండి. తెలుగులో ఆమె ‘సైజ్ జీరో’ కోసం బరువు పెరిగారన్న విషయం తెలుగువారికి తెలిసిన ముచ్చటే..!