calender_icon.png 22 April, 2025 | 9:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త మండలాలు కలేనా?

11-12-2024 12:38:48 AM

  • నిర్మల్ జిల్లాలో మూడింటిపై స్పష్టత కరువు
  • గత ప్రభుత్వం ఇచ్చిన జీవో బుట్టదాఖలు

నిర్మల్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): ఆదిలాబాద్ నుంచి నిర్మల్‌ను విడదీసి నిర్మల్ కేంద్రంగా 2016లో 13 మండలాల తో జిల్లాను అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 5 కొత్త మండలాలు ఏర్పాటు చేశారు. అయితే మండలాల ఏర్పాటులో కొన్ని గ్రామాలకు అన్యాయం జరిగిం దని కొందరు, తమ గ్రామాలను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ వస్తున్నారు. దీంతో అప్పటి జిల్లా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కొత్త మండలాల ఏర్పాటుపై హామీ ఇవ్వడంతో ఆందోళనలు సద్దుమణిగాయి.

గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తం గా కొన్ని కొత్త మండలాల ఏర్పాటుకు ప్రకటన చేశారు. నిర్మల్ జిల్లాలో మరో మూడు కొత్త మండలాలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించి, జీవో జారీ చేశారు. ఇందులో నిర్మల్ నియోజకవర్గంలోని సారంగపూర్ మండలం బీరవెళ్లి, మామాడ మండలంలోని పోన్కల్, ముథోల్ నియోజకవర్గంలోని బెల్‌తరోడా గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలనే మండల కేంద్రాలుగా చేస్తూ జీవోలో పేర్కొన్నారు.

దీంతో ఆ ప్రాంతాల ప్రజలు సంతో షం వ్యక్తం చేస్తూ సంబురాలు చేసుకున్నా రు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోవడం, నిర్మల్, ముథోల్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు కూడా ఓడిపోవడంతో కొత్త మం డలాల ఏర్పాటు కలగానే మిగిలింది. వీటికి తోడు మరో నాలుగు మండలాలు ఏర్పాటు చేయాలని జిల్లాలోని పలు పాంతాల ప్రజ లు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో అతి పెద్దమండలం, అధిక గ్రామాలు ఉన్న కుబీర్ మండలంలోని మాలేగాం, లేదా పల్సి, లక్ష్మణ చాందా మండలంలోని వద్యాల్, భైంసా మండలంలోని దేగాంలో భైంసా రూరల్ మండలంగా, ముథోల్ మండలంలోని అబ్దుల్లాపూర్‌ను కొత్త మండలాలుగా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. జనాభా, గ్రామాల సంఖ్య పరంగా చూస్తే ప్రజల డిమాండ్ సబబుగానే అనిపిస్తుంది. 

నిర్ణయం తీసుకోని సర్కారు

ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన క్యాబినెట్‌లో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మండలాలు, కొత్త రెవెన్యూ డివిజన్‌లు ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. నిర్మల్ జిల్లాలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రకటించిన మండలాలు లేకపోవడంతో ఆ ప్రాంత ప్రజలు నిరాశకు గురయ్యారు. వీటితో పాటు కొత్త మండలాల డిమాండ్ ఉన్న గ్రామాల ఊసే లేదు. దీంతో ప్రభుత్వ తీరుపై, ఇక్కడి నేతల హమీలపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతమున్న మండల కేంద్రాలకు చాలా గ్రామాలు ఎక్కువ దూరంలో ఉండటంతో ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేందుకు ప్రజలు వ్యయప్రయాసాలకు ఓర్చవలిసి వస్తున్నది. 

అంతేకాకుండా అధికారులు సైతం ఒక్కో మండలంలో దాదాపు 30 గ్రామాలు ఉండటంతో పర్యటన చేయడానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొత్త మండలాలు ఏర్పడితే పరిపాలన సులభతరం కావడంతోపా టు అధికారులకు, ప్రజలకు ఇబ్బందులు దూరమయ్యే అవకాశముంది. కాగా కొత్త మండలాల ఏర్పాటు ప్రకటనలో ప్రభుత్వ నిర్ణయంపై ఇక్కడి నేతలు జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లారు. ఆమె ముఖ్యమంత్రి, మంత్రివర్గ సమావేశాల్లో చర్చించి న్యాయం చేస్తానని హమీ ఇచ్చినట్టు వారు తెలిపారు.