- క్షేత్రస్థాయిలో భద్రపర్చేందుకు సామగ్రి ఏదీ?
- ఉన్నతాధికారుల ఆదేశాలతో వెలుగులోకి సమస్య
- ప్రత్యేక యాప్ రెడీ అయితేనే ఫామ్స్ డిజిటలైజేషన్
హైదరాబాద్, నవంబర్ 1౨ (విజయక్రాంతి): కులగణన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాన ఎజెండా. తెలంగాణలో కుల సర్వే చేసి దాన్ని జాతీయస్థాయిలో నమూనాగా చూపాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. ఈ సర్వే సమాచారం ఆధారంగానే తెలంగాణ భవిష్యత్‌ను పునర్మించాలని భావిస్తోంది. అంతటి ప్రతిష్ఠాత్మక కులగణనలో ఆదిలోనే లోపా లు కనిపిస్తున్నాయి.
అధికారుల నిర్లక్ష్యమో, ప్లానింగ్ శాఖ అవగాహన లోపమోగానీ సర్వే చేసిన పత్రాల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఎన్యూమరేటర్లు సర్వే చేసిన తర్వాత ఆ షీట్లను ఏ రోజుకారోజు సూపర్‌వైజర్‌కు అందజేస్తారు. ఆయన వాటిని ఎంపీడీవో కార్యాలయంలో భద్రపర్చాలి. వాటిని భద్రపర్చేందుకు క్షేత్రస్థాయిలో ఎలాంటి సామగ్రి లేకపోవడం నివ్వెరపరుస్తున్నది.
ముందస్తు ప్లానింగ్ లేకుండా అటు ప్రణాళిక శాఖ, ఇటు యం త్రాంగం సర్వేకు దిగినట్టు స్పష్టమవుతోంది. సర్వే మొదలైన రెండు రోజుల తర్వాత ఫామ్స్‌ను భద్రపర్చేందుకు సామగ్రి కొనుగోలు చేయాలని సిబ్బందికి ఉన్నతస్థాయి అధికారులు ఆదేశాలివ్వడంతో సర్వే నిర్వహణలోని లోపాలు స్పష్టమవుతున్నాయి.
ఎన్యూమరేటర్ల వద్దే షీట్లు
క్షేత్రస్థాయిలో ఎన్యూమరేటర్లు సమాచారాన్ని సర్వే పత్రాల్లో నింపిన తర్వాత వాటిని అదేరోజు సూపర్‌వైజర్‌కు ఇస్తారు. వాటిని సూపర్‌వైజర్ ఎంపీడీవో ఆఫీస్‌లోని సమర్పించి, ఆ రోజు ఎన్ని కుటుంబాల సర్వే పూర్తయ్యిందో చెప్పాల్సి ఉంటుంది. కానీ, మూడు రోజులుగా అలా జరగడం లేదు. రాష్ట్రంలోని దాదాపు 90శాతం మంది ఎన్యూమరేటర్లు సర్వే ఫామ్స్‌ను తమ దగ్గరే ఉంచుకొంటున్నారు.
క్షేత్రస్థాయిలో భద్రపర్చేందుకు తగిన సామగ్రి లేకపోవడంతో ఫామ్స్ ఎన్యూమరేటర్ల వద్దే ఉంచుతున్నట్టు తెలుస్తోంది. గ్రామాల్లో నివసిస్తున్న సిబ్బంది ఇళ్లు చాలావరకు ఇలాంటి పత్రాలను భద్రపర్చాడానికి అనుకూలంగా ఉండవు. అదే సమయంలో ఎంపీడీవో ఆఫీసుల్లో సమర్పించిన పత్రాలను కొన్నిచోట్ల తప్పితే.. చాలాప్రాంతాల్లో బస్తాల్లోనే భద్రపరుస్తున్నట్టు తెలుస్తోంది.
సర్వేలో భాగంగా సేకరించిన సమాచారాన్ని డిజిటలైజేషన్ చేసేందుకు ప్లానింగ్ శాఖ దానికి సంబంధించిన ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తోంది. ఆ యాప్ రెడీ అయితేనే సేకరించిన సమాచారాన్ని డిజిటలైజేషన్ చేస్తారు. అప్పటి వరకు సేకరించిన పత్రాలను జాగ్రత్తగా భద్రపర్చాల్సి ఉంటుంది.
సర్వే చేసిన కుటుంబాల సంఖ్యను అందుకే చెప్పడం లేదా?
కులగణన సర్వే ప్లానింగ్‌శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది. జిల్లాస్థాయిలో దీన్ని పర్యవేక్షించేది కలెక్టర్లు. ఈ క్రమంలో సర్వేలో ఎదరువుతున్న లోపాల గురించి చర్యలు తీసుకోవాల్సింది కలెక్టర్లు మాత్రమేనని ప్లానింగ్ శాఖ అధికారులు అంటున్నారు. సర్వే చేసిన తర్వాత పత్రాలను సూపర్‌వైజర్లకు అప్పగించడం, ఆ తర్వాత వాటిని ఎంపీడీవో ఆఫీస్‌లో సమర్పించడం.. వాటి భద్రతను పర్యవేక్షించడంతోపాటు రోజూవారీగా జిల్లాస్థాయిలో సర్వే చేసిన కుటుంబాల సంఖ్యను వెల్లడించే బాధ్యత కలెక్టర్లదేనని చెప్తున్నారు.
కానీ, హైదరాబాద్, కొన్ని జిల్లాలు మినహా మెజార్టీ జిల్లాల కలెక్టర్లు రోజు ఎన్ని కుటుంబాలు సర్వే చేసింది చెప్పడం లేదు. సర్వే చేసిన కుటుంబాల సంఖ్యను చెప్పకపోవడానికి ఓ ప్రధాన కార ణం ఉన్నట్లు తెలుస్తోంది. రోజు వారీగా సర్వే చేసే కుటుంబాలు అనుకున్న స్థాయిలో జరగడం లేదని క్షేత్రస్థాయిలో సిబ్బంది పేర్కొం టున్నారు. ఆశించిన స్థాయిలో సర్వే జరగపోవడం వల్లే కుటుంబాల సంఖ్యను చెప్పడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గత ప్రభుత్వ సర్వేలోని లోపాలను చూసైనా..
కులగణన ప్రభుత్వం అకస్మాత్తుగా చేపట్టినది కాదు. ౧౦ నెలలుగా అనేకసార్లు దీని గురించి సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్తూ వస్తున్నారు. సర్వే చేపట్టబోయే ముందు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకుంటే బాగుండేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నా యి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ౧౦ నెలల తర్వాత చేపడుతున్న ఈ సర్వేను పకడ్బందీగా చేపడుతుందని అందరూ భావించారు.
గతంలో కేసీఆర్ సర్కారు చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో ఎన్ని లోపాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. నాడు సేకరించిన పత్రాలు ఎక్కడపడితే అక్కడ ఎలా దర్శనమిచ్చాయో చెప్పనక్కర్లేదు. స మాచార పత్రాలను ఎలా భద్రపర్చాలి.. దానికి సంబంధించిన యాప్‌ను ముందే తయారు చేసిపెట్టుకోవాల్సిన యంత్రాం గం.. తీరా సర్వే మొదలు పెట్టిన తర్వాత వాటిగురించి ఆలోచించడం గమనార్హం.